ఆదిలాబాద్ జిల్లా యువతకు శుభవార్త చెప్పిన తెలంగాణా సర్కార్.. ఐటీ ఉద్యోగాలు మీ గుమ్మంలోకే!
ఆదిలాబాద్ జిల్లా యువతకు శుభవార్త చెప్పింది తెలంగాణా సర్కార్. ఇప్పటి వరకు అడవులు, గిరిజన ప్రాంతాలు, వ్యవసాయం వంటి వాటికే పరిమితం అయ్యి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్ళే ఆదిలాబాద్ వాసులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వారి ఇంటి ముంగిటే ఉండేలా ఐటీ టవర్ నిర్మాణం చేసింది.
యువత ఉపాధి కోసం వలస వెళ్ళకుండా ప్లాన్
యువత ఉపాధి కోసం హైదరాబాద్, వరంగల్ వంటి మైదాన ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నుండి అక్కడే హుందాగా ఉద్యోగాలు చేసే పరిస్థితికి మార్చింది. పట్టణ శివారులో 44వ జాతీయ రహదారికి ఆనుకొని రూ.58 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్ ఫైనల్ గా ప్రారంభానికి సిద్ధమైంది. ఈ భవనం జీ+4 అంతస్తులతో కూడి ఉంది. ప్రతి షిఫ్టుకు 660 మంది పనిచేసే సామర్థ్యం ఉంది.

రెండు వేల మంది యువతకు ఒకేసారి ఉపాధి
మూడు షిఫ్టులు నడిపితే దాదాపు రెండు వేల మంది యువతకు ఒకేసారి ఉపాధి అవకాశం కలుగుతుంది. భవనంలో విశాలమైన వర్క్స్టేషన్లు, మీటింగ్ హాళ్లు, క్యాంటీన్, లిఫ్టులు, ఆధునిక సదుపాయాలు అన్నీ సిద్ధం చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి పనిచేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఇప్పటికే రెండు ఐటీ కంపెనీలతో రెండేళ్ల కాలానికి ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఐటీ టవర్ ప్రారంభానికి ముహూర్తం త్వరలోనే
పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో ప్రారంభ ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది. ఈ టవర్ స్థానిక యువతకు సాఫ్ట్వేర్ రంగంలో నేరుగా అవకాశాలు కల్పించే వేదికగా నిలవనుంది. ఇన్నాళ్లూ ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి మారి, స్వగ్రామంలోనే ఉద్యోగాలు దక్కే అవకాశం ఏర్పడింది. జిల్లాలో ఐటీ వెలుగులు వ్యాపించడం వల్ల విద్యావంతులైన యువత స్థిరపడి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది.
యువత స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ కార్యక్రమాలు కూడా ఇక్కడే
అడవుల మధ్య ఉన్న ఈ జిల్లా ఇప్పుడు డిజిటల్ యుగంలోకి అడుగు పెట్టేలా చేసింది తెలంగాణా ప్రభుత్వం.ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఐటీ హబ్‌లు ఏర్పడితే రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య అభివృద్ధికి దోహదం చేస్తుంది. యువత స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ కార్యక్రమాలు కూడా ఇక్కడే నిర్వహించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రావడంతో ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ఆదిలాబాద్ లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది.













Click it and Unblock the Notifications