తనువు చాలించినా.. ఆరుగురికి ప్రాణదానం చేసిన 13 ఏళ్ల చిన్నారి.. పుట్టెడు దుఃఖంలోనూ..
చావు ఎటునుంచి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అది ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. అయితే తాజాగా హైదరాబాద్ లోని బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్ అయింది. అయితే ముక్కు పచ్చలారని ఆ చిన్నారి చనిపోతూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కుమార్తెను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకొచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. చిన్నారి అవయవాల ద్వారా ఆరుగురు నిస్సహాయ రోగులకు కొత్త జీవితం, పునర్జన్మ వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎమోషనల్ గా స్పందించారు.
" హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 13 ఏళ్ల బాలిక గూడ రోహిత అవయవాలను దానం చేసి, ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. కూకట్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కన్నబిడ్డను కోల్పోయిన తీరని శోకంలోనూ, అవయవదానానికి ముందుకు వచ్చిన తండ్రి నారాయణరావు గారి ఔదార్యం నన్ను ఎంతగానో కదిలించింది. తాను తనువు చాలిస్తూ కూడా ఆరుగురికి పునర్జన్మనిచ్చి అమరజీవిగా నిలిచిన చిన్నారి రోహిత త్యాగం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని సజ్జనార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోహిత 9వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల బాలానగర్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమెకు బలమైన గాయాలయ్యాయి. అయితే వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ పరిస్థితి విషమించి చిన్నారి బ్రెయిన్ డెడ్ అయింది. చిన్నారి రోహిత మరణ వార్తతో ఆ కుటుంబం గుండె పగులింది. రోహిత తండ్రి నారాయణరావు తీవ్ర శోకంలోనూ ఎంతో ధైర్యంతో గొప్ప ఆలోచన చేశారు. తమ బిడ్డ భౌతికంగా దూరమైనా.. అవయవాల రూపంలో ఇతరుల గుండె చప్పుడుగా బతకాలనే సంకల్పంతో అవయవదానానికి అంగీకారం తెలిపారు. ఈ మేరకు రోహిత నుంచి సేకరించిన కీలక అవయవాలను అవసరమైన ఆరుగురు రోగులకు అమర్చి వారి ప్రాణాలను కాపాడారు.












Click it and Unblock the Notifications
