ఇకపై తెలంగాణా విశ్వవ్యాప్త గుర్తింపు పొందే పర్యాటక డెస్టినేషన్!
తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా.. తొలి విడతలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎనిమిది ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాంతాల సర్వాంగ సుందరీకరణ, మౌలికవసతుల కల్పన కోసం అత్యున్నత ప్రమాణాలతో కూడిన సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేలా ప్రతిపాదనలు
హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెంట్లతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేలా ప్రతిపాదనలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. కేవలం పర్యాటకులు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా, అక్కడే కొన్ని రోజులు ఉండి ఆస్వాదించేలా ప్రకృతి, వారసత్వం, ఆధ్యాత్మికత, సాహస క్రీడల కలబోతతో కూడిన 'స్లో టూరిజం' విధానాన్ని ప్రోత్సహించాలన్నారు.

దేశంలోనే అత్యుత్తమ హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా భువనగిరి ఖిల్లా
ఇందులో భాగంగా ఆకాశ మార్గంలో నడిచే స్కైవాక్‌లు, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, అడ్వెంచర్ యాక్టివిటీలు, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శన శాలలు, ప్రకృతి ఆధారిత విడిది కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్కిటెక్ట్‌లకు దిశా నిర్దేశం చేశారు.ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రాత్మక భువనగిరి ఖిల్లాను దేశంలోనే అత్యుత్తమ హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి పేర్కొన్నారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్లాన్ ఇలా
రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి క్రీడలకు ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల కృష్ణానది బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక స్పాట్‌గా మార్చాలని ఆదేశించారు. సోమశిలలో విలాసవంతమైన క్రూయిజ్ టూరిజం, ఉత్సాహభరితమైన జలక్రీడలు, కొండలపై ట్రెక్కింగ్ మార్గాలు, వ్యూ పాయింట్లు, ఎకో టూరిజం ప్రాజెక్టులతో పాటు పెళ్ళిళ్లకు వేదికగా నిలిచేలా వెడ్డింగ్ డెస్టినేషన్‌లను కూడా అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
నూతన మాస్టర్ ప్లాన్ తో మారిపోనున్న పర్యాటక రంగ స్వరూపం
నూతన మాస్టర్ ప్లాన్లతో రాష్ట్ర పర్యాటక రంగ స్వరూపమే మారబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పర్యాటకాన్ని మనం ప్రోత్సహించాలని, అందరూ వచ్చేలా చేయాలని, అందుకే ఈ అభివృద్ధి మాస్టర్ ప్లాన్లు అంటూ ఆయన వివరించారు.













Click it and Unblock the Notifications