రేషన్ కార్డు దారులకు శుభవార్త.. త్వరలో బియ్యంతో పాటు ఆరు సరుకులు!
తెలంగాణ రేషన్ కార్డు దారులకు తెలంగాణా సర్కార్ శుభవార్త చెప్పనుంది. ప్రస్తుతం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, బియ్యంతో పాటు మరో ఆరు నిత్యావసర సరుకులను కూడా సబ్సిడీ ధరలకు అందించాలని యోచిస్తోంది. గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి - ఈ ఆరు వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే ప్రతిపాదనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.
మార్కెట్‌లో కిరాణా సరుకుల ధరలు పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాలని భావిస్తోంది. పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సరుకులను ఎక్కడి నుంచి సేకరించాలి, కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఎంత పరిమాణంలో ఇవ్వాలి, నిల్వ, రవాణా, పంపిణీ విధానం ఎలా ఉండాలి అనే అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వంపై ఏటా ఎంత ఆర్థిక భారం పడుతుందో కూడా అంచనా వేయాలని చెప్పారు.ఈ ప్రతిపాదనకు మరో కారణం కూడా ఉంది. రాబోయే కాలంలో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే అవకాశం, పంటల దిగుబడి తగ్గడం, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.42 కోట్ల మంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. నెలవారీగా దాదాపు 2.38 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతోంది.అక్టోబర్ 16 నాటికి ప్రభుత్వ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉంది. మరో 18.39 లక్షల టన్నులు రావాల్సి ఉంది.
మొత్తం నిల్వలు 28 లక్షల టన్నులకు చేరితే సుమారు 11 నెలలకు పైగా సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా అదనపు సన్న బియ్యం సేకరణ ద్వారా 14 నుంచి 16 నెలల భద్రత కల్పించాలని మంత్రి సూచించారు. ఈ కొత్త సరుకుల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ధరలు ఎంత ఉంటాయి, ఒక్కో కుటుంబానికి ఎంత కేటాయిస్తారు అనే వివరాలు ఇంకా ఖరారు కాలేదు.
అధికారుల నివేదిక వచ్చిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నెలవారీ ఖర్చు కొంత తగ్గి, ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం ఉంది. ప్రజలు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.













Click it and Unblock the Notifications
