తెలంగాణలో మరో భారీ ఎయిర్ పోర్ట్- భూసేకరణకు అనుమతులు మంజూరు
ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 700 ఎకరాల భూసేకరణకు అనుమతి ఇచ్చింది. ఈ విమానాశ్రయాన్ని భారత వైమానిక దళంతో కలిసి పౌర విమానయానాల కోసం సంయుక్తంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జీఓ ఇచ్చారు. భూమిని సేకరించే ప్రక్రియను ప్రారంభించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇదివరకే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. దీని ప్రకారం- ఇక్కడ మూడు కిలోమీటర్ల పొడవైన రన్‌వే నిర్మిస్తారు. విమానాశ్రయానికి ఒకవైపు పౌర టెర్మినల్, మరోవైపు ఐఏఎఫ్ స్టేషన్ ఉంటాయి. ఇది పౌర విమానాల రాకపోకలు సాగించడానికి, భారత వైమానిక దళం స్టేషన్ రూపంలో జాయింట్ గా పనిచేస్తుంది. గతంలోనే ఈ ప్రతిపాదనకు ఐఏఎఫ్ అంగీకరించింది. ఎన్ఓసీ కూడా జారీ చేసింది. ఫలితంగా విమానాశ్రయం డెవలప్మెంట్ కు మార్గం ఏర్పడింది.

ప్రస్తుతం.. ఆదిలాబాద్ శివార్లలోని శాంతి నగర్‌లో నిజాం కాలం నాటి ఎయిర్‌స్ట్రిప్‌తో సహా సుమారు 370 ఎకరాల భూమి వైమానిక దళం ఆధీనంలో ఉంది. ఆదిలాబాద్‌లోని వైమానిక కేంద్రంలో పౌర టెర్మినల్ అభివృద్ధి కోసం పక్కనే ఉన్న భూమిని సేకరించాలని వైమానిక దళం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల సుదీర్ఘ కల ఇది. తెలంగాణలో ఆరు ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఆరు విమానాశ్రయాలకు టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టులు సిద్ధం చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెంట్‌గా నియమించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి AAI తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదిలాబాద్ వైమానిక కేంద్రం నుండి పౌర విమానాల కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు భారత వైమానిక దళం (IAF) సూత్రప్రాయంగా అంగీకరించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications