గవర్నర్ తమిళిసై సంచలనం: మహిళా దర్బార్.. కేసీఆర్ ప్రభుత్వానికి మింగుడుపడని నిర్ణయం!!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా తమిళిసై రాజ్ భవన్ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాజ్ భవన్ లో మహిళా దర్బార్.. గవర్నర్ సంచలన నిర్ణయం
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జూన్ 10 శుక్రవారం రాజ్‌భవన్‌లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించారు. అందులో భాగంగా మహిళల సమస్యలను తెలుసుకోవడానికి మహిళా దర్బార్' నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. జూన్ పదవ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

మహిళలపై నేరాలు, మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనతో మహిళా దర్బార్ పై ఆసక్తి
ఇక ప్రజాదర్బార్ కార్యక్రమంలో గవర్నర్‌ను వచ్చి కలవాలనుకునే మహిళలు 040-23310521కు కాల్ చేయడం ద్వారా లేదా rajbhavan-hydgov.inకు ఈమెయిల్ చేయడం ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు వంటి నేరాల ఘటనలు, ప్రత్యేకించి రాష్ట్రంలోని ఒక ఉన్నత ప్రాంతంలో మైనర్‌పై సామూహిక అత్యాచారం ఘటనపై పెను దుమారం చెలరేగిన నేపథ్యంలో ఈ మహిళా దర్బార్ ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణా ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య గ్యాప్.. తాజా నిర్ణయంతో వివాదం ముదురుతుందా?
ఇప్పటికే గవర్నర్ తమిళిసై కి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధం నెలకొంది. గవర్నర్ తమిళిసై ని టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించిన తీరు ఏకరువు పెట్టారు. ఇక ఆ వివాదం సద్దు మణగక ముందే గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం రాజకీయంగా, ఇది గవర్నర్ మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలను మరింత దెబ్బతీయవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహిళల భద్రతపై దృష్టి పెట్టిన గవర్నర్ ... రాష్ట్రంలో పరిస్థితులపై మహిళా దర్బార్
17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై గవర్నర్ తీవ్ర వేదన వ్యక్తం చేయడంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీల నుంచి వివరణాత్మక నివేదికను కోరడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. అయితే గవర్నర్ కు బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఇంకా నివేదిక అందలేదు. మహిళల భద్రత, ప్రభుత్వం వద్ద ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఇతర ఫిర్యాదులకు సంబంధించి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకోవడానికి మహిళా దర్బార్ ఆమెకు సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

గవర్నర్ తాజా నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి
జూన్ 10న రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు మహిళలకు అవకాశం కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ గా అధికారం చేపట్టిన తరువాత ఆమె ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అది ఇంతకాలానికి అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏది ఏమైనా గవర్నర్ తాజా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య గ్యాప్ మరింత పెంచుతుంది అన్న భావన వ్యక్తమవుతోంది. మహిళా దర్బార్ నేపధ్యంలో ఏం జరగబోతుందో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications