డాక్టర్ తో పని లేదు, హెల్త్ ఏటీఎంలు- వీరికి ఇక నిమిషాల్లో వైద్య సేవలు...!!
వైద్య సేవల్లో ఏటీఎంలు వచ్చేసాయి. తెలంగాణ ప్రభుత్వం వీటి ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసారు. రెండు నెలల పరిశీలన తరువాత సానుకూల ఫలితాలు కనిపించాయి ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా క్షణాల్లో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్నీ పూర్తి అవుతున్నాయి. బీపీ, షుగరు వంటి వాటితో సహా 132 వైద్య పరీక్షలు చేస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు పైన చర్చ జరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం వైద్య సేవల్లో హెల్త్ ఏటీఎంల ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. రెండు నెలల పాటు వీటి సేవలను పరిశీలించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు..రిపోర్టుల కు సమయం పడుతోంది. దీంతో.. తక్షణమే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే హెల్త్ ఏటీఏంలపై సర్కారు దృష్టిసారించింది.

ఈ హెల్త్ ఏటీఎంలు అత్యంత ఆధునికమైన ఇంటి గ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయి. ఇవి మనిషి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను వెంటనే గుర్తిస్తాయి. శరీరాన్ని స్కాన్ చేసి, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు (బీపీ), బరువు, ఎత్తు, బీఎంఐ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి వంటి వాటి గురించి తక్షణమే రిపోర్టులు ఇస్తాయి.
అదే విధంగా రోగ నిర్ధారణ పరీక్షలైన రక్తంలో గ్లూకోజ్ (షుగర్), ఈసీజీ, కొలెస్ట్రాల్, యూరిన్ టెస్టులతో పాటు, డెంగ్యూ, మలేరియా, హెచ్‌ఐవీ వంటి వ్యాధులకు సంబంధించిన రాపిడ్ టెస్టులు కూడా చేస్తాయి. మొత్తం 132 రకాల పరీక్షల ఫలితాలు నిమిషాల్లోనే అందుబాటులోకి వస్తాయి. ప్రతి రోగి ఆరోగ్య రికార్డు డిజిటల్‌గా తయారై, సురక్షితంగా నిల్వ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా వారి ఆరోగ్య వివరాలను పొందవచ్చు. పరీక్షలు పూర్తయిన వెంటనే, రోగి ఈ యంత్రం ద్వారానే ఎక్కడో ఉండే వైద్యుడితో వర్చువల్‌గా మాట్లాడవచ్చు. మిషన్ సేకరించిన ఆరోగ్య డేటా మొత్తం డాక్టర్‌కు అందుతుంది. దీని ఆధారంగా డాక్టర్ సలహాలు, చికిత్సను అందిస్తారు.
కాగా, పరిశీలనలో భాగంగా హెల్త్ ఏటీఏం ద్వారా వచ్చిన టెస్టు ఫలితాలను, టీ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో చేసిన పరీక్షల ఫలితాలను పోల్చి చూశారు. రెండు నివేదికలు ఒకేలా ఉన్నాయి. అదే సమయంలో కొన్ని నమూనాలను ప్రైవేటు ల్యాబ్‌లకు కూడా పంపి పరీక్షించారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితాలను హెల్త్ ఏటీఎం ఇచ్చిన టెస్టు రిపోర్టులతో పోల్చి చూస్తే ఒకేలా ఉన్నాయి. దీంతో హెల్త్ ఏటీఏంలు ఇచ్చే ఫలితాలు చాలా ఖచ్చితత్వంతో ఉన్నాయని వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలు పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల్లో సెల్ప్ ఆపరేటెడ్ కియోస్కిలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో.. తెలంగాణ వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే అంశం పైన ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications