రైతుభరోసా అమలు పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీ రుణమాఫీ అమలు చేసిన ప్రబుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైంది. రుణమాఫీ పేరుతో రైతు భరోసా ఇవ్వటం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీంతో..రుణమాఫీ అమలు దిశగా ప్రబుత్వం కసరత్తు వేగవంతం చేసింది. పరిమితి గురించి అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఈ నెలాఖరులోగా అమలు పైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం.
రైతు భరోసా కసరత్తు
హామీ ఇచ్చిన విధంగా రూ 2 లక్షల రుణమాఫీ అమలు చివరి దశకు చేరింది. ఈ నెల 15న వైరాలో భారీ సభ ద్వారా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నారు. మూడు విడతల్లో చెప్పిన విధంగా రైతుల రుణ మాఫీ రేవంత్ ప్రభుత్వం అమలు చేసింది. ఇక, రైతు భరోసా అమలు అంశంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు భరోసా అమలును గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం రైతు భరోసా అమలు పైన ఫోకస్ చేసింది.

పరిమితి ఎంత
ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం కసరత్తు ప్రారంభమయినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ 15,075 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అయితే, అనర్హులకు బీఆర్ఎస్ ప్రభుత్వ రైతుభరోసా అమలు చేసిందనేది కాంగ్రెస్ వాదన. ఎంత పొలం మేరకు పరిమితి విధించాలనేది మరో చర్చ. ఈ అంశం పైన రైతు వేదికల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించి..అసెంబ్లీలో చర్చ ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలని భావించింది.
మార్గదర్శకాలు
గత ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి వారికి ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ధనవంతులు కూడా రైతు బంధు పథకం కింద లబ్ది పొందారు. ఇప్పుడు సాగు భూములు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది ఎకరాల పరిమితి విధించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీని ద్వారా అర్హులైన ప్రతీ రైతుకు రైతుభరోసా అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లోగా ఇందుకు సంబంధించి రేవంత్ ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు. ఆ వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications