కేంద్రమంత్రి బండి సంజయ్ కు గ్రూప్ 1 అభ్యర్థుల వినతి.. మ్యాటరేంటంటే
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ అభ్యర్థులు కేంద్రం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను నేడు కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని గ్రూప్ వన్ మెయిన్స్ కు ప్రిలిమ్స్ నుండి 1: 100 చొప్పున ఎంపిక చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీ పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు.
బండి సంజయ్ కు గ్రూప్ 1 అభ్యర్థుల వినతిపత్రం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను గ్రూప్-1 అభ్యర్ధులు ఈ ఉదయం కరీంనగర్ లో కలిశారు. ఈ సందర్భంగా వారు బండి సంజయ్ కు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను విన్నపించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు బండి సంజయ్ ను కోరారు.

అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తామన్న కాంగ్రెస్
గత నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ముందు వాపోయారు.
హామీ నెరవేర్చకుంటే ధర్నా చేస్తామన్న అభ్యర్థులు
గ్రూప్ 1 పోస్టులు అత్యధికంగా ఉండటంవల్ల 1: 50 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తే నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. కేరళ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ కు 1:75 చొప్పున ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భారీ ఎత్తున ధర్నా చేస్తామని కూడా వారు తెలిపారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న బండి సంజయ్
ఇక గ్రూప్-1 అభ్యర్ధుల సమస్యను విన్న బండి సంజయ్ నిరుద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయాలన్న బండి సంజయ్ నిరుద్యోగుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications