మీ ఇంట్లో ఐనా ఓకే! రేవంత్ సవాల్‌పై హరీశ్ రావు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి 14 నెలల పాలనపై చర్చకు సిద్ధమని.. సీఎం సవాలును స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి చెప్పిన చోటుకు, చెప్పిన సమయానికి వస్తానన్నారు. కొడంగల్ అయినా.. రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా చర్చకు సిద్ధమన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలతోపాటు అన్ని అంశాలపైనా చర్చ చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ప్రతి సవాల్ విసిరారు. నిందలు వేయడం మాని నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని రేవంత్ సర్కారుకు సూచించారు. అబద్ధాల కోసం కాకుండా పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించాలని హితవు పలికారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించుకుపోతుంటే ఆపడం చేతకాక.. తమపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు.
పాలమూరును ఎడారిగా మార్చిన తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో అంటకాగి తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు విమర్శించారు. 14 నెలల్లో ఒక్క చెక్ డ్యాం కూడా కట్టని వారు కేసీఆర్ గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి.. కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల గురించి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ రెడ్డికి నిజాలు ఇష్టం లేకపోయినా అవి ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ ఆనవాళ్లు రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించిన సంఘటన ఇది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్టు చేసిన ఓ వీడియోను ట్వీట్ చేశారు.
అర్థమైందా @revanth_anumula గారు,
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 21, 2025
గురుకులాల వల్ల ఎందరి జీవితాలు మారతాయో? మీరు మా మీద ఫేక్ కేసుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు అవే పైసలను ఈ పేద పిల్లల మీద పెట్టండి, కొంచెం పుణ్యం అయినా దక్కుతుంది.@KCRBRSPresident pic.twitter.com/0MEvkHSJYR
ఓ గిరిజన తండా నుంచి తొలిసారి ఎంబీబీఎస్ సీట్ సాధించి డాక్టర్ కాబోతున్న సత్యజ్యోతి విజయం ఎలా సాధ్యమైంది? కేసీఆర్ గారు 250 గురుకులాలను 1020కి పెంచడం వల్ల, మెడికల్ కాలేజీలను 5 నుంచి 33కి పెంచడం వల్ల, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసినందువల్ల, కేసీఆర్ వజ్ర సంకల్పం వల్లే సత్యజ్యోతిలాంటి ఎందరో బడుగువర్గాల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.
కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు రేవంత్ రెడ్డీ.. అది తెలంగాణ ముఖచిత్రంపై ఆయన చేసిన చెరగని సంతకం! అని హరీశ్ రావు పేర్కొన్నారు.
రేవంత్ విసిరిన సవాల్ ఏంటి?
ప్రజాపాలన సరిగాలేదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 12 ఏళ్ల నుంచి మోడీ ప్రధానిగా ఉన్నారు. 12 నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చర్చకు వస్తే పాలనపై ముఖ్యమంత్రిగా తాను సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, కేంద్రంలోని 12 బీజేపీ పాలనపై చర్చిద్దామని అన్నారు. చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications