పని పెరిగింది, ఈ శాఖ నాకొద్దు: కెసిఆర్‌కు హరీష్, కారణం అదేనా?
హైదరాబాద్: తనకు పని భారం పెరుగుతోందని, తన వద్ద ఉన్న మైనింగ్ శాఖను మరొకరికి అప్పగించాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు. మంత్రి హరీష్ రావు వద్ద నాలుగు శాఖలు ఉన్నాయి.
భారీ ఇరిగేషన్, మార్కెటింగ్, అసెంబ్లీ వ్యవహారాలతో పాటు మైనింగ్ శాఖలు హరీష్ రావు వద్ద ఉన్నాయి. తాజాగా, మంత్రుల శాఖలు మార్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రికి మరో విజ్ఞప్తి చేశారు.
తనకు పని ఒత్తిడి ఉందని, తనను మైనింగ్ శాఖ నుంచి తప్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తనకు పని భారం బాగా పెరుగుతోందని ఆయన చెబుతున్నారు. కెసిఆర్ సానుకూలంగా స్పందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మైనింగ్ శాఖను మరొకరికి అప్పగించే విషయమై ఆలోచిస్తున్నారు.

ఇదిలా ఉండగా, హరీష్ రావు తనకు పని భారం పెరుగుతోందని, తనను మైనింగ్ శాఖ నుంచి తప్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమవుతోంది. హరీష్ రావుకు నిజంగానే పని ఒత్తిడి ఉందా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. తెరాసలో లోలోన ఏమైనా జరుగుతోందా అనే చర్చ కూడా సాగుతోంది.
కాగా, పాలనలో వేగం పెంచడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మంత్రివర్గంలోని పలువురు మంత్రుల శాఖల మార్పుపై కేసీఆర్ ఆదివారం తుది కసరత్తు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు తెర దించుతూ కేవలం నాలుగు శాఖల్లోనే మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉన్న శాఖలతో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస యాదవ్, జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రస్తుతం కేసీఆర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మిషన్ భగీరథ, వాణిజ్య పన్నుల శాఖలు. తలసానిని వాణిజ్య పన్నుల శాఖ నుంచి బీసీ సంక్షేమ శాఖకు మార్పు, సినిమాటోగ్రఫీ శాఖను యథాతథంగా ఉంచారు. కేటీఆర్‌కు ఐటీ శాఖతో పాటు పరిశ్రమల శాఖ అదనం. జూపల్లి కృష్ణా రావుకు పరిశ్రమల శాఖ నుంచి పంచాయితీ శాఖకు మార్పు. జోగు రామన్న వద్ద ఉన్న రెండు శాఖల్లో బీసీ సంక్షేమ శాఖ తొలగింపు.












Click it and Unblock the Notifications