బాబుకు కళ్లమంట, ప్రాజెక్టుల వద్దే పడుకుంటా: హరీశ్, జగన్‌పైనా ఫైర్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు భూమి పూజ చేసుకుని తెలంగాణ ప్రజలు సంబరపడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లమంటతో వ్యవహరిస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. శుభకార్యం జరుగుతుంటే ముక్కులో పుల్ల పెట్టుకుని తుమ్మినట్టుగా ఏపీ కేబినెట్ తీరు ఉందని ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ ఏపీ కేబినెట్ చేసిన తీర్మానం చెల్లని రూపాయి వంటిదన్నారు. ఆ తీర్మానానికి విలువలేదు కనుకనే కోర్టుకు పోతామంటున్నారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తాము ఉద్యమించిన సమయంలో కూడా ఆంధ్రా నాయకులు తప్పుడు లెక్కలు చెప్పారని, అదే బుద్ధి ఇప్పుడు కూడా చూపిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి తీరుతామని, దగ్గరుండి మరీ వాటిని పూర్తి చేయిస్తానని హరీశ్ రావు తేల్చిచెప్పారు. దీక్ష చేస్తానంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పైచేయి సాధించేందుకే ఏపీ ప్రభుత్వం కుటిల రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులను, ప్రాజెక్టులను బలిచేయాలనుకోవడం వారి వంకర బుద్ధిని బయటపెడుతోందని అన్నారు.

న్యాయం, ధర్మం, నీతి తమవైపు ఉన్నాయని, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, అబద్ధాలు వారి వైపు ఉన్నాయని, ఎక్కడైనా ధర్మమే గెలిచి.. నీతి నిలబడుతుందని అన్నారు. కోర్టులకు పోయి ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నుతున్నారన్నారు. కానీ, ఇప్పుడున్నది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదని మేల్కొన్న బెబ్బులి అన్నారు.

ప్రాజెక్టుల వద్ద స్వయంగా నిద్ర చేసైనా వాటిని పూర్తి చేసి తీరతామన్నారు. 'అక్రమ ప్రాజెక్టులు కట్టుకున్నది మీరు. జలదోపిడీ చేసింది మీరు. శ్రీశైలం రిజర్వాయర్‌కు పొక్కపెట్టిన దొంగలు మీరు. కృష్ణానదిని కబళించుకుపోయింది మీరు. అన్యాయంగా గోదావరిని కృష్ణా బేసినకు తరలిస్తున్నది మీరు. కృష్ణాబేసినకు దక్కాల్సిన నీళ్లను రాయలసీమకు తరలిస్తున్నది మీరు. తెలంగాణను ఎండబెట్టింది మీరు' అంటూ హరీశ్ రావు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Harish-vbn

పాలమూరు రైతుల ఉసురు పంచుకున్నది, నల్గొండ ఫ్లోరైడ్‌కు కారకులు మీరేనని హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరి అనుమతితో పట్టి సీమను కట్టిండ్రు?, ఎవరి అనుమతి తీసుకుని పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచిండ్రు? ఎవరి అనుమతి తీసుకుని హంద్రీ-నీవా కట్టుకున్నరు? గాలేరు నగరి ప్రాజెక్టు కట్టుకోమని ఏ ట్రైబ్యునల్‌ చెప్పింది? వెలిగొండ ప్రాజెక్టుకు ఏం అనుమతులున్నయి? కృష్ణా గోదావరి నదుల్లో మీకున్న వాటా ఎంత? మీరు వాడుతున్నది ఎంత? మాకున్న వాటా ఎంత? మేం వాడుతున్నది ఎంత? సమాధానం చెప్పగలరా?' అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు.

'కృష్ణా బేసినలోనే ఉన్న పాలమూరు, నల్గొండ జిల్లాలకు కృష్ణానీరు ఇస్తుంటే అడ్డు తగులుతారా? కృష్ణా బేసిన్లో ఉన్న జిల్లాలను ఎండబెట్టి ఆ నీళ్లను పెన్నా బేసిన్లోని ప్రాంతాలకు ఇవ్వడం న్యాయమా? దీనికి ఏ ట్రైబ్యునల్‌ ఒప్పుకొంది? ఏ కోర్టు ఒప్పుకొంది' అని హరీశ్ రావు నిలదీశారు. నీళ్ల దోపిడీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ జరిపించాలంటూ కేంద్రానికి లేఖ రాయగలరా? అని నిలదీశారు.

పట్టిసీమకు పరిహారంగా మాకు 45 టీఎంసీలు

అనుమతులు, నీటి కేటాయింపుల గురించి చంద్రబాబు బాగానే మాట్లాడుతున్నారని, కానీ పట్టిసీమనుమాత్రం ఆయనే అక్రమంగా కట్టారని, అదేమంటే అది పోలవరంలో భాగమంటున్నారని హరీశ్‌ ఎద్దేవా చేశారు. ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తే అంతే మొత్తంలో ఎగువ రాష్ర్టాలకు కృష్ణానీటిలో వాటా పెంచాల్సి ఉంటుందన్నారు. దాని ప్రకారం కృష్ణాలో 45 టీఎంసీల నీటి వాటా పెరుగుతుందన్నారు.

సమైక్య రాష్ట్రం ఏర్పడక ముందే 100టీఎంసీల నీటితో మరో ప్రాజెక్టును కట్టిండ్రా? మరి ఆ వంద టీఎంసీలు ఎక్కడికి పోయినయ్‌? ఇది మీరు చేసిన దగా కాదా? అని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 70 టీఎంసీల నీటితో పాలమూరును కడతామని స్పష్టం చేసి సర్వేకోసం 2013, అక్టోబర్‌ 8న జీవో-72ని జారీ చేశారని చెప్పారు.

సర్వే పనుల కోసం 7 కోట్లు ఇచ్చింది అబద్ధమా? 2014 ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో నరేంద్ర మోడీ పాలమూరు ప్రాజెక్టును ప్రస్తావించలేదా? ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కట్టలేకపోయిందని, తాము అధికారంలోకి వస్తే కడతామని మోడీ ఆ నాడు చెప్పలేదా? మరి అప్పుడెందుకు మాట్లాడలేదన్నారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007 జూలై 7న డిండి ప్రాజెక్టు కోసం జీవో. 159 విడుదల చేశారని గుర్తు చేశారు. 30 టీఎంసీల నీటితో కట్టే ప్రాజెక్టు సర్వే కోసం రూ.1.30 కోట్లు కేటాయించారన్నారు. సర్వే కూడా జరిగిందని చెప్పారు. ఆ రెండు పాత ప్రాజెక్టులా? కొత్త ప్రాజెక్టులా? ఉమ్మడి ఆంధ్రప్రదేశలోనే ప్రతిపాదించినవి కాదా? రాజకీయాల కోసం ఇన్ని అబద్ధాలు ఆడతారా? మండపిడ్డారు.

అవి పాత ప్రాజెక్టులే కాబట్టి విభజన చట్టం పరిధిలోకి రావని, అపెక్స్‌ కమిటీకి పోయి కొత్త అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. విభజన తర్వాత అనుమతులు లేకుండా పట్ట సీమ ప్రాజెక్టు కట్టిందెవరని, విభజన చట్టాన్ని ఉల్లంఘించింది నువ్వు కాదా? అంటూ బాబుపై హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశకు 811 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉన్నాయని, అందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలని నాటి ఉమ్మడి ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ, 299 టీఎంసీలు తమ వాటా కాదని, వాటితో పాటు 77 టీఎంసీల మిగులు జలాలను తెలంగాణకు కేటాయించారని చెప్పారు.

కృష్ణా నదీ జలాల్లో ప్రతి రాష్ట్రానికీ ఎస్‌బ్లాక్‌ అలాట్‌మెంట్‌ (అంటే గంపగుత్త కేటాయింపులు) ఉందని, ఎస్‌బ్లాక్‌ అలాట్‌మెంట్‌ వాటర్‌ను ఆయా రాష్ట్రాలు తమకు అనుకూలమైన పద్ధతిలో వాడుకోవచ్చని బచావత ట్రైబ్యునల్‌ తన తీర్పులో స్పష్పంగా చెప్పిందని హరీశ్ రావు తెలిపారు. తర్వాత వచ్చిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ కూడా ఇదే చెప్పిందన్నారు. ఆ ప్రకారమే పాలమూరు, డిండి కడుతున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+