హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చంపేశారు: రేవంత్ సర్కారుపై హరీశ్ రావు ఫైర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రామా చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను చంపేశారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం గ్రామాల్లో తిరగలేని పరిస్థితి దాపురించిందన్నారు.
కేంద్రం నుంచి వచ్చిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.800 కోట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని హరీశ్ రావు ఆరోపించారు. తొమ్మిది నెలల పాలనలోనే 2 నెలల పింఛన్లు మింగేశారని మండిపడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణ పడకేయడంతో వ్యాధులు పెరిగాయని, ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చారని ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్రంలో 50 శాతానికి మించి రైతు రుణమాఫీ కాలేదన్నారు హరీశ్ రావు. కేవలం 21 లక్షల మంది రైతులకు మాత్రమే అయినట్లు చెప్పారు. రైతులకు 100 శాతం రుణమాఫీ అయ్యేదాకా.. పంట బీమా, భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందని హరీశ్ రావు హెచ్చరించారు.
రైతులకు బోనస్ ఇస్తామన్న మాట బోగస్ అయ్యిందన్నారు. మరోవైపు పంటల బీమా అటకెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల గారడితో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను గ్రామాలను గాలికి వదిలేసి, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తుందని విమర్శించారు. పది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీకి నిధులు విడుదల అవ్వట్లేదని, సర్పంచులను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయన్నారు హరీశ్ రావు.
గత ప్రభుత్వం హయాంలో ప్రతినెలా పల్లె ప్రగతికి నిధులు వచ్చాయని, ఇప్పుడేమో నిధులు కరవయ్యాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిస్తున్న యూట్యూబ్‌లు చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతొందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications