తెలంగాణాకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: కేంద్రంపై భగ్గుమన్న మంత్రి హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొనసాగుతున్న చర్చలో ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వ వైద్య కళాశాలలపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు.

మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణాకు కేంద్రం అన్యాయం
దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు వల్లే తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు భాషరాని దేశాలకు వెళ్లి వైద్యవిద్య నేర్చుకోవాల్సి వస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో మెడికల్ కాలేజ్ కి రెండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపినా కూడా మొండిచేయి చూపించిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వైద్య ఆరోగ్య రంగాన్ని ఉమ్మడి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గత పాలకుల హయాంలో వైద్య రంగం కుదేలైంది అని పేర్కొన్నారు.

తెలంగాణాలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు
రాష్ట్రం ఏర్పడే నాటికి ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 700 గా ఉంటే వచ్చే సంవత్సరానికి ఈ సంఖ్య 2850 కి పెంచుకోవడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకుంటున్నామని సంవత్సరానికి రెండు వేల సీట్లు చొప్పున ఎంబీబీఎస్ సీట్లను పెంచుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పన్నెండు కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేసిందని వెల్లడించారు.

తెలంగాణా విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి పడుతున్న ఇబ్బందులు వారివల్లే
వైద్య విద్య కోసం భాష రాకపోయినా చైనా ఉక్రెయిన్ తదితర దేశాలకు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివిధ దేశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రామగుండం ప్రాంతాలలో కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
Recommended Video

అరవై ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాకు కేవలం మూడు మెడికల్ కాలేజీలు
అరవై ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేవలం మూడు మెడికల్ కళాశాలలను కేటాయించారని, ఉద్యమం చేయడం వల్లే ఆదిలాబాద్లోని మెడికల్ కాలేజీ ఏర్పాటు జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిందని మంత్రి వైద్య రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను శాసనసభ వేదికగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications