వైయస్ లాక్కుంటే మాట్లాడలేదే, జనతా దళ్‌ను నిలువునా చీల్చారు: హరీష్ ఫైర్
హైదరాబాద్: నాడు వైయస్ రాజశేఖర రెడ్డి తమ పార్టీకి (టీఆర్ఎస్) చెందిన పది మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే అప్పుడు మంత్రులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడలేదని, ఇప్పుడు వలసల పైన ఎందుకు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆదివారం మండిపడ్డారు.
టిడిపి, కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, ప్రజాప్రతినిధులు కారు ఎక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వలసల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు.
వైయస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటే అప్పుడు ఎందుకు నోరు మెదపలేదని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. అప్పుడు గుర్తుకు రాని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోరుకొని ఇప్పుడు తమ పార్టీలో నాయకులు చేరుతున్నారని చెప్పారు.

అరవై ఏళ్ల పోరాటం, త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని చెప్పారు. జనతా దళ్‌ను నిట్ట నిలువునా చీల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అని నిప్పులు చెరిగారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం తెరాసలో చేరితే తప్పేమిటన్నారు. నాడు పార్టీలు చరిత్ర కలిగిన వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రేపు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, సునీతా లక్ష్మా రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ ఫిరాయింపులు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఏఐసీసీ పెద్దలు తెలంగాణ నేతలతో చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications