హరీశ్ రావు పీఏ అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ వంశీకృష్ణతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలతో వంశీకృష్ణతోపాటు సంతోష్ కుమార్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు.
చక్రధర్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ డబ్బులు వసూలు చేశారని ముగ్గురు నిందితులపై ఆరోపణలు ఉన్నాయన్నారు. కేసులో ఏ1గా హరీశ్ రావు, ఏ2గా రాధాకృష్ణన్ రావు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో చక్రధర్ గౌడ్ ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు కలిసి ఓ రైతు గుర్తింపు కార్డులతో సిమ్ కార్డు కొనుగోలు చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి.

అంతేగాక, గతంలో ఆరోగ్యశ్రీ శాఖలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు హరీశ్ రావు పీఏ వంశీకృష్ణపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడు ఆయన పేషీలో వంశీకృష్ణ పనిచేశారు.
ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై చక్రధర్ గౌడ్ గత సంవత్సరం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాజాగా, నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 28 వరకు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు.












Click it and Unblock the Notifications