జగన్! నీ తండ్రి నిర్ణయమే, బాబు తప్పొప్పుకో: హరీష్, ఏపీలో కేసులపై..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం ఘాటుగా స్పందించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతి లేదని జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే.
దీనిపై హరీష్ రావు స్పందించారు. నక్కలగండి ప్రాజెక్టుకు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అనుమతులు వచ్చాయని చెప్పారు. జగన్ తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, వైయస్ హయాంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
పాలమూరు, నక్కల గండి ప్రాజెక్టుల పైన ఏపీ అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. ఓటుకు నోటు గురించి మాట్లాడుతూ... ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తప్పుచేసినట్టు ఒప్పుకోవాలని సూచించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే నానా రభస చేస్తున్నాడన్నారు.

ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేకపోతే తప్పు చేసినట్టు అంగీకరించాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఆడియో టేపులో ఉన్న గొంతు చంద్రబాబుదేనని తేలితే రాజీనామాకు సిద్ధమా అని సవాల్ చేశారు.
ఏపీలో కేసులకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు సూత్రధారి అన్నారు. స్టీఫెన్ సన్‌తో మాట్లాడిన గొంతు ఎవరిదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈటెలను పరామర్శించిన కేసీఆర్
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్ గవర్నర్‌తోను భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
గరికపాటితో తెలంగాణ టీడీపీ నేతల భేటీ
గరికపాటితో తెంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. అంతకుముందు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications