ఇక మీదే బాధ్యత, డిపాజిట్ చేసైనా: హరీష్, రేవంత్ దీక్షకు భారీ స్పందన
హైదరాబాద్: రైతులకు తాము 2013 జీవో ప్రకారమే పరిహారం చెల్లిస్తామని, వారికి అన్యాయం జరిగితే ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.
మల్లన్న సాగర్, ఇతర ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన ప్రతిపక్షాల తీరు సరికాదన్నారు. ఉత్తర తెలంగాణకు మల్లన్న సాగర్ గుండెకాయ వంటిదన్నారు. మల్లన్న సాగర్ పైన ప్రతిపక్షాలు రోజుకో మాట మాట్లాడుతున్నాయని విమర్శించారు.
నాలుగు జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకే ఈ ప్రాజెక్టు కడుతున్నామని, దీనిని అడ్డుకోవడం సరికానద్నారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 49వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ముంపు గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.. పులిచింతల కోసం 17 గ్రామాలను ముంచారని విమర్శించారు.
తాము డిజైన్ మార్చి ముంపు గ్రామాలను ఆరు గ్రామాలకు తగ్గించామన్నారు. తాము చట్ట ప్రకారమే భూములకు విలువ కట్టిస్తామన్నారు. లేదంటే రైతులకు కోర్టులో డబ్బు డిపాజిట్ చేసైనా సరే ప్రాజెక్టులను కట్టితీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. కాగా, మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని టిడిపి, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రెండో రోజుకు రేవంత్ దీక్ష
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్‌లో చేస్తున్న నిరాహార దీక్ష ఆదివారం రెండవ రోజుకు చేరుకుంది. రేవంత్ దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
వందల సంఖ్యలో నిర్వాసితులు రేవంత్ దీక్ష చేస్తున్న ప్రాంతానికి వస్తున్నారు. గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నట్టు పలువురు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదంటూనే, సరైన పరిహారం ఇచ్చిన తర్వాతే ముందడుగు వేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు రేవంత్ తన దీక్షను విరమించనున్నారు. రేవంత్‌కు కరీంనగర్ జిల్లా నేతలు సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications