కేటీఆర్‌కు నిన్న ఓకే... మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం: హరీష్ వ్యాఖ్యల వెనుక..!!
కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్కసారి ముఖ్యమంత్రిగా కాదని, ఆయన మరో నాలుగు పర్యాయాలు సీఎంగా కావడం ఖాయమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం చెప్పారు. మరో 20 ఏళ్ల వరకు ఆయనే సీఎం అన్నారు.
వరంగల్: కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్కసారి ముఖ్యమంత్రిగా కాదని, ఆయన మరో నాలుగు పర్యాయాలు సీఎంగా కావడం ఖాయమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం చెప్పారు. మరో 20 ఏళ్ల వరకు ఆయనే సీఎం అన్నారు.
వరంగల్‌లో గతంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభలు చరిత్ర సృష్టించాయని, ఈ నెల 27న నిర్వహించే బహిరంగ సభతో చరిత్రను తిరగరాయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. హరీష్ రావు హన్మకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో సభాస్థలిని శనివారం సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం వరంగల్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు. టీఆర్ఎస్ సర్కారు మూడేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు.

రాష్ట్రాభివృద్ధి కోసం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. టిడిపిది ముగిసిన చరిత్ర అన్నారు. బీజేపీకి గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో అయిదు సీట్లు వచ్చాయని, 2019లో అవి కూడా దక్కవని జోస్యం చెప్పారు.
50 లక్షల తెరాస సభ్యత్వాలు నమోదు చేయించాలని పుస్తకాలు ముద్రించామని హరీష్ రావు చెప్పారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో మళ్లీ ముద్రించామన్నారు. 27న బహిరంగ సభకు అంచనాలకు మించి జనం వస్తారన్నారు.
కాగా, కేసీఆర్ తర్వాత తెరాసకు ముఖ్య నేతగా మంత్రి కేటీఆర్‌ను ఎలివేట్ చేసే ప్రక్రియ జరుగుతోందని ఇటీవల ఎక్కువగా వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో హరీష్ రావు మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా సమర్థిస్తాననే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019లో మళ్లీ కేసీఆర్ సీఎం అని తెరాస చెబుతోంది.
కేటీఆర్ 2024 వరకు ఎలివేట్ అవుతారని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు కవిత, హరీష్ రావుల నుంచి కెటిఆర్‌కు పోటీ ఉంటుందని భావించారు. కానీ వారిద్దరు కూడా ముఖ్యమంత్రి తనయుడికి మద్దతు పలికారు. ఇలాంటి సమయంలో మరో నాలుగు పర్యాయాలు కేసీఆరే సీఎం అని హరీష్ రావు చెప్పడం గమనార్హం. దీంతో ఈ వ్యాఖ్యల వెనుక ఏమైనా ఉందా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications