రేవంత్ ముమ్మాటికీ ఆయన శిష్యుడే..!!
KTR: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు విమర్శలు సంధించారు. పలు ఆరోపణాస్త్రాలను సంధించారు. కోట్ల రూపాయలను దండుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్ తలపెట్టారని మండిపడ్డారు.
మూసీ పునరుజ్జీవం కోసం 1,100 కోట్ల రూపాయలు సరిపోతాయని, దీనికి రెట్టింపు మొత్తంలో, వేల కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఎన్ని కోట్ల రూపాయలను ముడుపులుగా ఇస్తోన్నారని నిలదీశారు.

ఇదే విషయాన్ని తాము ప్రశ్నిస్తే బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అతి ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తామంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. భారీ విగ్రహం ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించిన వెంటనే మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
తనకు ఎలాంటి విగ్రహాలు వద్దని, దానికయ్యే ఖర్చును పేదలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి వినియోగించాలంటూ గతంలో మహాత్ముడు చెప్పిన మాటలను తుషార్ గాంధీ గుర్తు చేశారని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్.. రేవంత్ రెడ్డిని నాథూరామ్ గాడ్సేతో పోల్చారు.
రేవంత్ రెడ్డి గాడ్సే శిష్యుడు
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2024
గాడ్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడుతాడంట
గాంధీ మనవడు ఏమో విగ్రహం వద్దు, ఆ డబ్బుతో పేదలకు మంచి చేయండి అంటే.. ఈ గాడ్సే శిష్యుడు ఏమో విగ్రహం పెడుతాడంట - కేటీఆర్ pic.twitter.com/jnkc0dnYAd
నాథూరామ్ గాడ్సేకు రేవంత్ రెడ్డి శిష్యుడని విమర్శించారు. గాడ్సే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలాన్ని అందిపుచ్చుకున్నాడని, రేవంత్ రెడ్డి కూడా అదే భావజాలం ఉందని ఆరోపించారు. అలాంటి నాయకుడి చేతులతో గాంధీ విగ్రహాన్ని ఎలా స్థాపిస్తారని కేటీఆర్ అన్నారు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే నెలకొల్పినట్టవుతుందని వ్యాఖ్యానించారు.
మహాత్మా గాంధీ విగ్రహాన్ని అడ్డుపెట్టుకుని శిఖండిలాగా వందల కోట్ల రూపాయలను దండుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ విషయంలో జరుగుతున్న దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, గట్టిగా బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications