విచారించేందుకేం లేదు: రేవంత్ లాయర్, ఆ డబ్బెక్కడ, 10మందిని కొంటే ప్రభుత్వం పడిపోయేది: ఏసీబీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని విచారించేందుకు ఇంకా ఏమీ లేదని, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు చేశారు. రేవంత్ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో శుక్రవారం మధ్యాహ్నం వాదనలు జరిగాయి. కోర్టు 30న తీర్పు వెల్లడించనుంది.
రేవంత్ తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను విచారించేందుకు ఇంక ఏమీ లేదన్నారు. ఏసీబీ ఇప్పటి వరకు 17 మందిని విచారించిందని చెప్పారు. సోదాలు కూడా నిర్వహించిందని తెలిపారు.
రికార్డులను సీజ్ చేసిందన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని 25 రోజుల పాటు జైలులో ఉంచారని తెలిపారు. రేవంత్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో రేవంత్ నుండి ఇంకా తీసుకునేందుకు ఏ సమాచారం లేదని, షరతులతో బెయిల్ ఇవ్వవచ్చునని కోరారు.
ఈ కేసులో ఏసీబీ సెక్షన్ 164 కింద వాంగ్మూలాలను తీసుకుందని, మొత్తం 17 మంది నుంచి వాంగ్మూలాలను నమోదు చేసిందని కోర్టుకు తెలిపారు. రేవంత్ సహా ముగ్గురిని ఏసీబీ ప్రశ్నించిందన్నారు. ఇంకా ఆయనకు జైలు అవసరం లేదని చెప్పింది.
ఏసీబీ తరఫు న్యాయవాది ఏజీ రామకృష్ణా రెడ్డి వాదిస్తూ... ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉన్నందున రేవంత్ రెడ్డికి బెయిల్ ఈ పరిస్థితులలో ఇవ్వవద్దని కోర్టుకు విన్నవించింది.

నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఇచ్చేందుకు రూ.50 లక్షలు ఎక్కడి నుండి సమకూరాయి? మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని కోరారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశముందని చెప్పారు.
ఈ కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాల్సి ఉందన్నారు. కనిమొళి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరారు.
కస్టడీలో రేవంత్ రెడ్డి ఏమి చెప్పలేదా అని ఏజీని జడ్జీ ప్రశ్నించారు. ఈ కేసులో కుట్ర ఉందని, 10 మంది ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వం పడిపోయేదని కోర్టులో వాదించారు. బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కేసులో సండ్ర వెంకటరమణ తప్పించుకు తిరుగుతున్నాడని తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం ఈ కేసులో ఇంకా కొంతమందిని విచారించే అవసరం ఉందని వాదనలు వినిపించారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు జెరూసలేం మత్తయ్య రూ.2 కోట్లు ఆఫర్ చేశాడని చెప్పారు. ఈ సందర్భంగా జడ్జి కల్పించుకొని ఎమ్మెల్సీ స్థానాలకు ఎంతమంది పోటీ చేశారని ప్రశ్నించారు. ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ చేశారని తెలిపారు. రేవంత్ ఒక్క ఎమ్మెల్యేను కొనాలని చూశారని, పదిమందిని కొంటే ప్రభుత్వమే పడిపోయేదన్నారు.
కాగా, అంతకుముందు ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబోరటరీ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన సీల్డ్ కవర్‌లో ఇచ్చిన నాలుగు నివేదికలను ఏసీబీ శుక్రవారం పరిశీలించింది. ఈ నివేదికలు తమకు ఇవ్వాలన్న ఏసీబీ అధికారుల అభ్యర్థునను తిరస్కరించింది. కావాలంటే కోర్టులోనే చూడవచ్చునని సూచించింది.
ఒరిజినల్ నివేదికలు ఇవ్వడం కుదరదని తెలిపింది. నివేదిక కావాలంటే మెమో దాఖలు చేయాలని, ఫోరెన్సిక్ అనుమతి కావాలని సూచించింది. దీంతో మరో మెమో దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాగా, ఫోరెన్సిక్ ఆడియో, వీడియోలను పరిశీలించి ప్రాథమిక నివేదిక కోర్టుకు అందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications