హైదరాబాద్‌లో కుండపోత వర్షం: రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం, జీహెచ్ఎంసీ హెచ్చరిక
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుండపోత భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలకు పైగా వర్షం దంచికొట్టింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మలక్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, బడంగ్‌పేట్, మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, శంషాబాద్ సహా తదితర ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరిక
ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో పలుచోట్ల రోడ్లు, లోతట్లు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, లోతట్టు ప్రాంతాలకు వర్షం చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
రోడ్లపై వరదనీటితో వాహనదారుల ఇబ్బందులు, సహాయక చర్యలు
ఇక, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు.. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. చెరువులను తలపిస్తున్న రోడ్ల నుంచి నీటిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్, చంపాపేట్, కర్మాన్ ఘాట్, ఉప్పల్, నాచారం, తార్నాక, బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇక, ముసరాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఎల్బీనగర్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌లో రెండు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, సరూర్‌నగర్, కూకట్‌పల్లి, చందానగర్ ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.
మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్ తోపాటురాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం కిందిస్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలిపింది.
మరింత బలపడనున్న అల్పపీడనం..
తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం బలహీనపడినట్టు పేర్కొంది. అక్టోబర్ 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వరద డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి
హైదరాబాద్ నగరంలోని చింతలకుంట ప్రాంతంలో ఓ వ్యక్తి బైక్ పై వెళుతూ డ్రైనేజీ వరదలో కొట్టుకుపోయాడు. పోలీసులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అతని కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. గల్లంతైన వ్యక్తిని కర్మాన్‌ఘాట్‌కు చెందిన జగదీష్‌గా గుర్తించారు. అతడు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. కాగా, భారీ వర్షంతో రహదారులపై వరదనీరు నదులను తలపించాయి. ఓ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన ఆటో కూడా వరదలో కొట్టుకుపోయింది. ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా వరదలో నీటిలో తేలియాడుతూ కనిపించాయి.












Click it and Unblock the Notifications