Monsoon Update: రైతులకు శుభవార్త.. ఈసారి మంచి వర్షాలే..!
వాతావరణ శాఖ రైతుకు శుభవార్త చెప్పింది. రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ అండమాన్ ప్రాంతంలో, నికో బార్ దీవుల్లోకి ప్రవేశించినట్లు అంచనా వేసింది. మే 31న రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వివరించింది. బంగాళాఖాతంలో రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తున్నాయని పేర్కొంది. ఎల్ లీనో పరిస్థితులు పోయి లానినా పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భూ మధ్యరేఖ వద్ద ఫసిపిక్ సముద్రం చల్లబడడంతో ఈ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
లానినా ఏర్పడితే ఈ సంవత్సరం వర్షా కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షపాతం కురిసేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేసింది. గతంలో 9సార్లు ఎల్ నినో వచ్చి తర్వాత లానినా రావడంతో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ గుర్తు చేసింది. దేశంలో ఈశాన్య, తూర్పు, వాయవ్య కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు బంగాళాఖాతంలో మే 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ అల్పపీడనం మే 24 వాయిగుండ మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో వానలు పడతాయని అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బోయిన్ పల్లి, చిలకలగూడ, బేగంపేట్ లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో నీరు నిలిచిపోయింది. తెలంగాణలో జూన్ 6 తర్వాత రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications