హైదరాబాద్‌లో భారీ వర్షం: జలమయమైన రోడ్లు, ఈ మార్గాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బుధవారం సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములతో పలు ప్రాంతాల్లో జోరు వాన పడింది. మాదాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
మాదాపూర్‌లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నెక్టార్ గార్డెన్, శిల్పారామం రహదారులపై వర్షపునీరు పొంగిపొర్లింది. మాదాపూర్ నుంచి కేపీహెచ్‌బీ వెళ్లే మార్గంలో, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మదాపూర్ మౌండ్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా, గచ్చిబౌలి బయోడైవర్సిటీ మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరదనీరుతో ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సీబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, లింగంపల్లి, బహదూర్పురా, బార్కస్, ఉప్పుగూడ, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మేట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, సంగారెడ్డి జిల్లాలోని ఏకధాటిగా కుండపోత వాన కురిసింది. సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, కంది, పటాన్‌చెరు, మామిడిపల్లిలో వర్షం పడింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోలో యాదాద్రి దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కాసేపు వడగండ్ల కూడా పడ్డాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారిపోయింది.
బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొంది. వర్షంతపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications