తెలంగాణాలో నేడు భారీవర్షాలు: వానదెబ్బకు నీట మునిగిన వరంగల్ నగరం!!
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రానికి మరో మారు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు శుక్రవారం పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రేపు శనివారం కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు ఈనెల ఏడవ తేదీ నుండి 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Recommended Video


ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల ప్రభావం .. నగరంలో పలు కాలనీలు జలమయం
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో నిత్యం వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ నగరంలో రహదారులపై మీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా, అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదనీటిలో చిక్కుకున్న కాలనీలలో పరిస్థితులు దారుణంగా మారాయి.

ఆగస్ట్ 9 వరకు వర్షాలు .. ఈ జిల్లాలలోనే అధికంగా వర్షపాతం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి ఒడిశా తీరం నుండి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ-మధ్య మరియు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్లింది. ఈ ప్రసరణ సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆగస్టు 9 (మంగళవారం) వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రతి జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, ఆదిలాబాద్, నిర్మల్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల గత నెలలో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గోదావరి నదికి వరద నీరు ఉధృతంగా రావడంతో, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో వరద ముంపు చోటుచేసుకుంది. ఇక ఆ పరిస్థితుల నుండి బయటపడతాం అనుకున్న సమయంలో మళ్లీ విస్తారంగా కురుస్తున్న వర్షాలు ముంపు ప్రాంతాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదుల కు వరద నీరు పోటెత్తుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే విపరీతమైన వర్షపాతం నమోదు కాగా, వచ్చే రెండు మూడు వారాలు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.












Click it and Unblock the Notifications