నగరం నానుతోంది! వీడని వర్షాలతో నిండుకుండల్లా జంట జలాశయాలు, భారీ గాలుల అలర్ట్
హైదరాబాద్: గత నాలుగైదు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో తడిసి ముద్దవుతోంది. ముసురు వదలకపోవడంతో భాగ్యనగర ప్రజలు శీతల వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. మంగళవారం కూడా జోరువానలు కొనసాగుతున్నాయి. దీంతో నగర ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు, జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు నిండుకుండల్లా ఉన్నాయి.
నిండుకుండల్లా హైదరాబాద్ జంట జలాశయాలు
భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 515 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడిచిపెడుతున్నారు. హిమాయత్ సాగర్‌లో ప్రస్తుతం 1763.50 అడుగుల నీటి మట్టం ఉంది. మరోవైపు, ఉస్మాన్ సాగర్‌కు 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్లు ఎత్తి 312 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడిచిపెడుతున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1786 అడుగుల వరకు నీటి మట్టం ఉంది.
హుస్సేన్ సాగర్‌కు భారీ వరద, అలర్ట్
ఇక భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారింది. కూకట్‌పల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటి మట్టం 513.41 మీటర్ల పూర్తిస్థాయికి చేరింది. వస్తున్న ఇన్ ఫ్లోకు సమానంగా తూముల ద్వారా నీరు బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో రానున్న 12 గంటలపాటు ఈదురుగాలులతో వర్షం
మరోవైపు, రానున్న 12 గంటలపాటు బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఎక్కువ తీత్రతతో గాలులు వీస్తాయని, దీంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చెట్ల కింద ఉండొద్దని, బయటకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
ఎమెర్జెన్సీ కోసం డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే 040-29555500కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. భారీ గాలలు నేపథ్యంలో సంజీవయ్య పార్కులోని అతిపెద్ద జాతీయ జెండాను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాత్కాలికంగా కిందకు దించారు.












Click it and Unblock the Notifications
