జమ్మూకాశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం హెల్ప్‌లైన్
పహల్గాం మారణకాండ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్యాటకులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యాటకులకు తగిన సహాయం అందిస్తామని అన్నారు
ఈ ఘటనపై తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని మంత్రి వివించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాలని.. తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి కోరారు.

పర్యాటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు, అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
జమ్మూకాశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల సహాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పర్యాటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు 9440816071, 9010659333, 040 23450368 నంబర్లకు కాల్ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.
కాగా, జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలు తీసిన విషయం విధితమే. మతం, పేరు అడిగి మరీ వారి ప్రాణాలు తీయడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి.
మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో పాకిస్థాన్ దేశంపై భారత్ పలు ఆంక్షలకు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేసింది. భారతదేశంలో ఉన్న పాకిస్థానీయులు 48 గంటల్లోకా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. వాఘా బోర్డర్‌ను మూసివేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా భారత్ పట్ల ఇలాంటి చర్యలకు దిగింది. భారత విమానాలను తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉద్రిక్తలను మరింతగా పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications