OU issue: ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్‌కు హైకోర్టు నోటీసులు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేయొద్దంటూ సర్క్యూలర్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ధర్నాలు చేయరాదంటూ జారీ చేసిన సర్క్యులర్‌పై వివరణ ఇవ్వాలంటూ ఓయూ రిజిస్ట్రార్‌తో పాటు ప్రభుత్వానికి హైకోర్టు గురువారం నోటీసులు జారీ
చేసింది.
ఉస్మానియాలో ఎలాంటి నినాదాలు, ధర్నాలు, నిరసనలు చేయరాదంటూ మార్చి 13న జారీ చేసిన సర్క్యూలర్ ను సవాల్ చేస్తూ రఫీ అనే విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ చొరబాటు, ధర్నాలు, నిరసనలు చేయడం, నినాదాలు చేయడం, పరిపాలనా వ్యవహారాలను అడ్డుకోవడం, అధికారులు, సిబ్బందికి వ్యతిరేకంగా దూషణలు, అసభ్య పదజాలం వాడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సర్క్యులర్ జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

ఈ సర్క్యులర్ భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొన్నారు. నిరసన ప్రాథమిక హక్కు అంటూ సుప్రీం కోర్టు తీర్పులున్నాయన్నారు. అంతే కాకుండా సర్క్యులర్‌లో చొరబాటు అని ఉందని, ఎక్కడ, ఎవరు తదితరాలేవీ లేవన్నారు. అస్పష్టంగా ఉన్న సర్క్యులర్‌ను కొట్టివేయాలని కోరారు.
దీనిపై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. వాదనలను విన్న న్యాయమూర్తి ..ఉస్మానియా యూనివర్సిటీకి, ఉన్నత విద్యాశాఖకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ నెల 9వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications