కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కొనసాగింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ రెండు పథకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. ఈ పథకాల అమలుపై హైకోర్టు సింగిల్ ధర్మాసనం విధించిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్.. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా.. ఈరోజు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కాగా, ధర్మాసనం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఈ పథకాల కొనసాగింపునకు మార్గం సుగమమైంది.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో, విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి పథకాల అమలుపై మధ్యంతర స్టే విధించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ పథకాలు 2014 నుంచి నిరంతరాయంగా అమలవుతున్నాయని, పిటిషనర్ లబ్ధిదారుడు కానందున ఆయనకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని కోర్టుకు తెలిపారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై దాఖలైన ఇలాంటి వ్యాజ్యాలను డివిజన్ బెంచ్ మాత్రమే విచారించాలని వాదించారు.
షాదీ ముబారక్ వంటి పథకాలకు సుప్రీంకోర్టు కూడా గతంలో అనుమతినిచ్చిందని వివరించారు. దీంతో, అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తాజా నిర్ణయంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు రాష్ట్రవ్యాప్తంగా యథావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమం అయింది.













Click it and Unblock the Notifications