బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: హైకోర్టులో వారికి చుక్కెదురు, స్టే ఇవ్వలేమన్న కోర్టు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నుండి బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న క్రమంలో, బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బిజెపి ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో బిజెపి నేతలు కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు సస్పెన్షన్ పై స్టే ఇవ్వటం సాధ్యం కాదని పేర్కొంది.
Recommended Video

బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు
తెలంగాణ శాసనసభ నుండి బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేదాకా తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజసింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో ఉన్నత న్యాయస్థానం స్టే ను తిరస్కరించింది. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పును శుక్రవారానికి రిజర్వు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు తీర్పు వెలువరించిన ఉన్నత ధర్మాసనం బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

కోర్టులో వాదనలు వినిపించిన ఇరువర్గాలు.. బీజేపీ వాదన ఇలా
కోర్టులో వాదనలు వినిపించిన ఇరు వర్గాలు ఎవరి వాదన వారు వినిపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు తమను సస్పెండ్ చెయ్యటాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారని, తమను అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా కావాలనే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన స్పీకర్ సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేసి తమకు సభలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. సస్పెన్షన్ తీర్మానాన్ని, రికార్డులను సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని బిజెపి ఎమ్మెల్యేలు తరఫున న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు.

ప్రభుత్వ వాదన ఇలా... స్టే కుదరదన్న కోర్టు
చట్ట సభ గౌరవానికి భంగం కలిగినప్పుడే సస్పెన్షన్ చెయ్యొచ్చు అని, కానీ అక్కడ అలా జరగలేదన్నారు. ఆరోపణలను నిర్ధారించుకోవటానికి ప్రొసీడింగ్స్ కాపీని ఇవ్వాలని కోరగా ఏజీ అందుకు నిరాకరించారు.అయితే దీనికి కోర్టు అంగీకరించలేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారమే సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ విషయంలో నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం స్పీకర్ కు ఉంటుందని ఏజీ తన వాదనను వినిపించారు. అసెంబ్లీ నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ఉన్న సుప్రీంకోర్టు తీర్పును ఏజీ బీఎస్ ప్రసాద్ ప్రస్తావించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు బీజేపీ నేతల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడం కుదరదని పేర్కొంది.












Click it and Unblock the Notifications