కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై వారికి బిగ్ రిలీఫ్..!
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధిస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ పథకాల నిధుల విడుదలపై ఇచ్చిన మధ్యంతర స్టేను సవరించింది. దివ్యాంగ వధువులకు సంబంధించి ఊరటనిచ్చే నిర్ణయాన్ని వెల్లడించింది. దివ్యాంగ వధువులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందించే ఆర్థిక సాయంపై గతంలో విధించిన స్టేను హైకోర్టు తాజాగా తొలగించింది. హైకోర్టు ఆదేశాలతో దివ్యాంగ లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు మినహా మిగిలిన సాధారణ వర్గాల లబ్ధిదారులకు సంబంధించి మాత్రం నిధుల విడుదలపై ఉన్న స్టే యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అయితే 2014 నుంచి రాష్ట్రంలో అమలు అవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపివేస్తూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకాల అమలు కోసం 2014 నుంచి జారీ చేసిన ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) అమలుపైనా కోర్టు స్టే విధించింది. ఈ పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు ఎలాంటి చెల్లింపులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. నిధుల విడుదలపై ఉన్న స్టేను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు రాక చాలామంది ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ఇటువంటి పరిస్థితుల్లో ఉచిత పథకాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసం..? అని హైకోర్టు ప్రశ్నించింది. కష్టపడి పని చేసే ప్రజల ట్యాక్స్ డబ్బును ఇలా ఉచిత పథకాలకు మళ్లించడం న్యాయమేనా..? అంటూ ఉన్నత న్యాయస్థానం నిలదీసింది. శాసనసభ ఆమోదం లేని ఇటువంటి ఉచిత పథకాలకు వందల కోట్లు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications