మార్చిలోనే నిప్పుల కుంపటి.. కానీ వర్షాలు పడే ఛాన్స్!
మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. నిన్న గ్రేటర్ హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రధానంగా కనిపిస్తుంది. అదే విధంగా హయత్ నగర్, మంచిర్యాల జిల్లా కాసిపేట లో కూడా 40.7° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో 40.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, తిర్యాణి, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 40.4° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాద్ అర్బన్ లోను, సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ లోను 40.2° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకి ఎండలు పెరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.

మార్చి నెల చివరినాటికి గ్రేటర్ హైదరాబాద్లో 42 డిగ్రీలు దాటే ఛాన్స్
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల వరకు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇక మార్చి నెల చివరినాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక పక్క పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మరోవైపు రాత్రి చల్లని గాలులు వీస్తున్నాయి.
రాష్ట్రంలో భిన్న వాతావరణం
ఈ వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయని అటువైపు నుంచి వస్తున్న గాలులతో పగటి పూట ఎండ, సాయంత్రం వేళ వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం గాలిలో తేమ శాతం తగ్గుతుందని, ఈ వాతావరణం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్తున్నారు.
18, 19 తేదీలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం
18, 19 తేదీలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మారుతున్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముందు ముందు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications