దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా..ఇంతే: కేటీఆర్ షాకింగ్: సిలికాన్ సిటీ సఫ్రాన్ సిటీ
బెంగళూరు: కర్ణాటకలో హిజబ్ వివాదం ఉగ్రరూపాన్ని దాల్చింది. కళాశాలలు రణరంగంగా మారాయి. ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. కర్ణాటక వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. తొలుత ఉడుపి, కోలార్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందళనలు..ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. మండ్య, బాగల్‌కోటె, శివమొగ్గ, దావణగెరె, యాద్గిర్ వంటి పలు జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఫలితంగా 144 సెక్షన్‌ను విధించాల్సి వచ్చింది.

కళాశాలల్లో ఘర్షణ వాతావరణం..
ముస్లిం విద్యార్థినులు సంప్రదాయబద్ధమైన హిజబ్ ధరించి కళాశాలలకు రావడాన్ని అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. తొలుత ఉడుపిలో ఎంజీఎం కళాశాలలో ఈ వివాదం ఆరంభమైంది. క్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపించింది. కొందరు విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి తరగతులకు హాజరు కావడం, హిజబ్ వేసుకున్న విద్యార్థినులను అడ్డుకోవడం వంటి పరిణామాలు సంభవించాయి. అనేక జిల్లాల్లోని కళాశాలల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.

స్కూళ్లు మూసివేత..
ఈ ఉద్రిక్తతలను నివారించడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను మూడురోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు. విద్యార్థులు సంయమనాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. హిజబ్ వివాదానికి సంబంధించిన పిటీషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోందని అన్నారు. విద్యార్థులు శాంతంగా ఉండాలని అన్నారు.

హిజబ్ వివాదంపై విచారణ కొనసాగింపు..
హిజబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ కొనసాగిస్తోంది న్యాయస్థానం. సోమవారం విచారణ చేపట్టింది. ఈ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఈ విచారణ కొనసాగనుంది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంట్లకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. న్యాయస్థానాలకు రాజ్యాంగం మాత్రమే భగవద్గీత అవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి లోబడే తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
కేటీఆర్ ఆందోళన..
కర్ణాటకలో నెలకొన్న హిజబ్ పరిణామాలపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళనను వ్యక్తం చేశారు. హిజబ్ వివాదానికి సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో చూశానని, అవి తనను బాధ, నిరాశకు గురి చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఉర్దూ కవితను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు సంభవించినా.. ఒకేరకమైన మోడస్ ఓపెరాండి కనిపిస్తుంటుందని అన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.

ఇలాంటి పరిస్థితులు తలెత్తాయంటే..
కర్ణాటక.. సిలికాన్ వ్యాలీ నుంచి సఫ్రాన్ వ్యాలీగా శరవేగంగా మార్పు చెందుతోందంటూ అభిషేక్ బక్షి అనే ఓ ట్విట్టరెటీ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ బదులు ఇచ్చారు. కర్ణాటక హిజబ్ తరహా పరిస్థితులు తలెత్తితే.. దేశంలో ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతున్నాయనే అర్థమని కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు జరిగే ప్రతీసారీ ఇలాంటి ఉద్రిక్తతలు, భావోద్వేగాలతో ముడిపడిన సంఘటనలు ఏర్పడుతుంటాయని పేర్కొన్నారు. దీన్ని ఉర్దూ కవిత రూపంలో రాశారు. కొన్ని పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం విభజించు-పాలించు అనే విధానాన్ని అనుసరిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు.












Click it and Unblock the Notifications