మహా శివరాత్రి ఉత్సవాలు; శోభాయమానంగా ముస్తాబైన ఓరుగల్లులోని చారిత్రక శైవక్షేత్రాలు
మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణా రాష్ట్రంలోని చారిత్రక శివాలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. ముఖ్యంగా కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శివరాత్రి సందర్భంగా ఆలయాలలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి.

శివరాత్రి సందర్భంగా శోభాయమానంగా ఆలయాల ముస్తాబు
హన్మకొండలోని రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాలగుడి, రామప్ప దేవాలయం, కటాక్షపురంలో శివకేశవాలయాలు, మెట్టుగుట్ట రామ లింగేశ్వర ఆలయం, పద్మాక్షి వద్ద ఉన్న సిద్దేశ్వరాలయం, కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం ఇలా ప్రముఖ శైవ క్షేత్రాలు శివరాత్రి సందర్భంగా శోభాయమానంగా ఉన్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లులో ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నాయి. కాకతీయ రాజులు ముఖ్యంగా శివారాధకులు కావటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది.

ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా శివాలయాలు
కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. హర హర మహాదేవ శంభో అంటూ భక్తజనం ఆ పరమశివుని కరుణాకటాక్ష వీక్షణాల కోసం శైవ క్షేత్రాల్లో బారులు తీరే శుభ సమయం వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, కటాక్షాపూర్ లోని శివాలయం, ఓరుగల్లు కోటలోని కాశీ విశ్వేశ్వరాలయం తో పాటుగా, అయినవోలు, కురవి వంటి శైవక్షేత్రాలలోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో భక్తుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేకాలను చేస్తూ భక్తజనం మహాశివరాత్రి వేడుకలు జరుపుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

వేయి స్తంభాల ఆలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామికి తెల్లవారుజాము నుండే మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు . భక్తజనంతో వేయిస్తంభాల దేవాలయం మహా శివరాత్రి సందర్భంగా పోటెత్తుతుంది. ప్రస్తుతం రుద్రేశ్వరస్వామి గా పూజలందుకుంటున్న ఆ పరమ శివుని దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల శివరాత్రి జాగారాలతో దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ప్రతి ఏటా ఘనంగా వేయి స్తంభాల దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినా వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.

రామప్ప దేవాలయంలో ఘనంగా శివరాత్రి
ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయంలో సైతం మహాశివరాత్రి పర్వదినాన వేడుకలు ఘనంగా జరుగుతాయి . రామలింగేశ్వరస్వామికి తెల్లవారుజాము నుండే పూజాధికాలు నిర్వహిస్తారు. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం రామప్ప అనే శిల్పి నిర్మాణం చేయడం వల్ల రామప్ప దేవాలయం గా ప్రసిద్ధి గాంచింది. మహా శివరాత్రి వేడుకలతో పాటు జాగరణ చేసే భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ మహాశివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు.

కురవి వీరభద్ర ఆలయం, పద్మాక్షి సిద్దేశ్వర ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు
ఇక పద్మాక్షి గుట్ట వద్ద ఉన్న సిద్దేశ్వర స్వామీ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. హన్మకొండకు 27కిలోమీటర్ల దూరంలోని కటాక్షపురంలో శివకేశవాలయాలలో సైతం వేడుకలు నిర్వహించటానికి ఏర్పాటు చేశారు. వరంగల్ కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయంలోనూ శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.ఇక కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయం,బచ్చన్నపేట మండలం కొడవటూరులోని సిద్ధేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

కొమురవెల్లి, ఐనవోలు మల్లన్న, పాలకుర్తి సోమన్న ఆలయాల్లో శివరాత్రి సందడి
చేర్యాల మండలంలోని కొమురవెల్ళి మల్లికార్జున స్వామి ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామీ దేవాలయం ,పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, మెట్టుగుట్టపై ఉన్న రామలింగేశ్వరాలయాలే కాదు ఇలా ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మిక్కిలి శైవ క్షేత్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఈ శైవ క్షేత్రాలలో శివరాత్రి పర్వదిన వేడుకలు చాలా అంగ రంగ వైభవంగా ఆధ్యాత్మికత ఉట్టి పడేలా సాగుతాయి.












Click it and Unblock the Notifications