హెచ్ఎండీఏ శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: భారీ అవినీతికి పాల్పడిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. శివబాలకృష్ణపై మంగళవారం హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిశోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
కస్టడీకి శివబాలకృష్ణ
మరోవైపు, శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఆయననను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ప్రస్తుతం శివబాలకృష్ణ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఇటీవల మణికొండ పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీ ఆదిత్య పోర్ట్‌వ్యూ విల్లాతోపాటు ఆయన సన్నిహితులు, బంధువులకు సంబంధించిన మొత్తం 16 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు జరిపిన సోదాల్లో రూ. 8.26 కోట్ల నగదు లభ్యమైంది. మొత్తం స్థిరాస్థుల మార్కెట్ విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అక్రమంగా సంపాదించిన సొమ్ముతో శివబాలకృష్ణ ఎక్కువగా భూములు కొన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 100 ఎకరాలు ఉండొచ్చని.. అవన్నీ హైదరాబాద్ శివార్లతోపాటు కొడకండ్ల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామల్లో గుర్తించినట్లు సమాచారం. పలు కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.
హెచ్ఎండీఏ డైరెక్గర్‌గా ఉన్నప్పుడే కాకుండా రెరా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా స్థిరాస్తి సంస్థలకు లబ్ది చేకూర్చడం ద్వారా భారీగా మొత్తంలో అక్రమంగా సంపాదించారని ఏసీ అధికారులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications