సిలిండర్, బకెట్, కుర్చీ, బీరువా.. పంచాయతీకి చేరిన ఇంటి సామాన్లు..!
హైదరాబాద్ : ఇంటి సామాన్లు పంచాయతీకి చేరాయి. వంటగదిలో ఉండాల్సిన కూరగాయలు సైతం పంచాయతీలో భాగమైపోయాయి. వంకాయ, క్యారెట్ మొదలు కిచెన్ సామాన్లే కాకుండా ఇంటి వస్తువులన్నీ కూడా అక్కడికే క్యూ కట్టాయి. ఇదంతా ఏంటనుకుంటున్నారా? పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సందడి చేయనున్న గుర్తులు ఇవి.

కోడ్ మారింది.. 7 కాదు 6
పంచాయతీ నగారా మోగింది. ఆమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో తలమునకలైంది. ఇదివరకు 7 అంకెలతో కోడ్ ఉన్న బ్యాలెట్ పత్రాల్లో కొద్దిగా మార్పులు చేశారు అధికారులు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో 6 అంకెల కోడ్ ముద్రించారు. జిల్లా కలెక్టర్లు, డీపీవో లు ఏడంకెల బ్యాలెట్ పేపర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 4 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణీత శాతం మేర బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో ఇంటి సామాన్ల హవా
పంచాయతీ ఎన్నికల్లో ఇంటి సామాన్ల హవా కొనసాగనుంది. కాదేదీ ఎన్నికల గుర్తుకు అనర్హమన్నట్లుగా ఉంది పరిస్థితి. సర్పంచ్, వార్డుమెంబర్లకు కేటాయించనున్న గుర్తులు వేర్వేరుగా ఉండనున్నాయి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఈసీ అధికారులు. సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించనున్న గుర్తులివే..
*వంకాయ *మామిడికాయ *అరటిపండు *ఫోర్కు *చెంచా *క్యారెట్ *కప్పు సాసరు *బిస్కట్ *కొబ్బరికాయ *బుట్ట *బకెట్ *కత్తెర *కుర్చీ *టేబుల్ *మంచం *లేడీ పర్సు *ఉంగరం *బ్యాట్ *బ్యాటరీ లైట్ *దువ్వెన *షటిల్ *బంతి *నల్లబోర్డు *గాలిబుడగ *వేణువు *విమానం *దువ్వెన *సీసా *గొడ్డలి *పలక *బ్రష్

వార్డుమెంబర్లకు ఈ గుర్తులే..!
సర్పంచ్, వార్డుమెంబర్లుగా పోటీచేసే అభ్యర్థులకు గుర్తులు వేర్వేరుగా ఉన్నాయి. వార్డుమెంబర్లుగా పోటీచేయనున్న అభ్యర్థులకు కేటాయించనున్న గుర్తులివే..
*గరాటా *మూకుడు *గ్యాస్‌సిలిండర్ *గ్యాస్‌పొయ్యి *గాజు గ్లాసు *కేతిలి *జగ్గు *కుండ *గౌను *కటింగ్ ప్లేయర్ *బీరువా *డిష్‌యాంటీనా *విల్లుబాణం *హాకీ *బంతి *నెక్ టై *స్టూల్ *ఈల *కవరు *పోస్టు డబ్బా *విద్యుత్ స్తంభం