టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై తేనె టీగల దాడి... ప్రమాదమేమీ లేదన్న వైద్యులు...
కరీంనగర్ జిల్లా మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై తేనెటీగలు దాడి చేశాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో పర్యటిస్తున్న సమయంలో అనంతగిరి పంప్ హౌజ్ వద్ద ఆయనపై తేనెటీగల దాడి జరిగింది. ఎమ్మెల్యేతో పాటు ఇల్లంతకుంటకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులపై కూడా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో రసమయి బాలకిషన్ సహా పలువురు నేతలు స్థానిక ఆస్పత్రిలో చేరారు. బాలకిషన్‌కు ప్రమాదమేమీ లేదని... ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. రసమయిపై తేనెటీగల దాడి జరిగిందని తెలియడంతో మానకొండూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందినట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో రసమయి బాలకిషన్ ప్రస్తుతం అక్కడి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నిజానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక రసమయి బాలకిషన్ పూర్తిగా సైలెంట్ అయిపోయారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటివరకూ పలువురు టీఆర్ఎస్ నేతలు ఈటలపై విమర్శలు చేసినప్పటికీ రసమయి మాత్రం ఆయన విషయంలో నోరు మెదపలేదు. గతంలో ఆయనతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈటలపై రసమయి ఏమీ మాట్లాడలేకపోతున్నారని చెబుతున్నారు.

రసమయితో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే తయారైందన్న వాదన ఉంది. ఈటల రాజేందర్‌కు రంజిత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు. పార్టీలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. ఒక్కసారిగా ఈటలను పార్టీ నుంచి బయటకు పంపించడంతో రంజిత్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయారు. అటు ఈటలను విమర్శించలేక... ఇటు పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టలేక తటస్థంగా ఉండిపోయారు. దీంతో రసమయి,రంజిత్ రెడ్డిల వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఉపఎన్నిక విషయానికి వస్తే... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గులాబీ సైన్యమంతా హుజురాబాద్‌లో మోహరించింది. మంత్రులు,ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో మోహరించి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఉపఎన్నిక వేళ నియోజకవర్గంలో సంక్షేమ,అభివృద్ది పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను చిత్తు చేసేందుకు వ్యూహ,ప్రతి వ్యూహలతో ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే అభ్యర్థి విషయంలో మాత్రం ఇప్పటికీ తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. ఈటలకు ధీటైన అభ్యర్థిని నిలిపేందుకు కేసీఆర్ ఇంకా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications