
ఆగని పరువు హత్యలు.. వనపర్తిలో కూతురిపై అనుమానంతో హతమార్చిన తండ్రి
వనపర్తి జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో కుటుంబం పరువు తీస్తుందని ఓ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కన్న కూతురిపైనే కనికరం లేకుండా ప్రవర్తించాడు. కన్న కూతురునే తండ్రి అత్యంత దారుణంగా పదునైన ఆయుధంతో గొంతులో పొడిచి చంపేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాత పల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే

కూతురి ప్రేమ వ్యవహారం .. తండ్రీ కూతుళ్ళ మధ ఘర్షణ
పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అయితే రాజశేఖర్ దంపతుల రెండవ కుమార్తె, 15 సంవత్సరాల గీత పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోందన్న విషయం తండ్రికి తెలిసింది. దీంతోతీవ్ర అసహనానికి గురైన తండ్రి కూతురిని ప్రశ్నించాడు. దీంతో మంగళవారం ఉదయంఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
కూతురిని చంపిన తండ్రి .. కేసు నమోదు
ఊళ్ళో గ్రామస్తులు పలు రకాలుగా అనుంకుంటున్నారని, కుటుంబ పరువు తీస్తున్నావని తండ్రి కుమార్తె పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రేమ పేరుతో తన కుటుంబాన్ని బజారుకు ఈడుస్తుందని ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి క్షణికావేశంలో చేతికి దొరికిన పదునైన ఆయుధం తో గొంతు భాగంలో పొడిచి కుమార్తెను దారుణంగా హతమార్చాడు. కుటుంబీకుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లల ప్రేమతో పరువు పోతుందని ఫీలవుతున్న తల్లిదండ్రులు.. జీవితాలు నాశనం
తండ్రి, కుమార్తె ప్రవర్తనపై అనుమానంతో హతమార్చాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఆనంద్ రెడ్డి తెలియజేశారు. ఇటీవల కాలంలో మళ్లీ పరువు హత్య కేసులు పెరిగిపోతున్నాయి. తక్కువ కులం వాళ్లను ప్రేమించారు అన్న కారణంతో, అవమానంగా ఫీల్ అవుతున్న చాలామంది తల్లిదండ్రులు పిల్లలను దారుణంగా హతమార్చిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అయితే పరువు కోసం పిల్లల ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు వారి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు.