హైదరాబాద్‌లో పరువు హత్య: వెంటాడి, భార్య ముందే భర్తను ఇనుపరాడ్లతో కొట్టి చంపారు
హైదరాబాద్: మతాలు వేరైనా వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోయినా వివాహం బంధంతో ఒక్కటై తమ కాపురాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు. ఇంతలోనే తమ అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నారనే కోపం పెంచుకున్న యువతి బంధువులు.. ఆమె భర్తను ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కళ్లేదుటే భర్త చనిపోవడంతో ఆ యువతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

మతాలు వేరైనా ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు..
పోలీసులు, స్థానికులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా.. ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఆశ్రిన్ కుటుంబసభ్యులు అతడిని హెచ్చరించారు. అయితే, ఆశ్రిన్‌ను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న నాగరాజు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్ల కంపెనీలో కొద్ది నెలల కిందట సేల్స్‌మన్‌గా చేరాడు. జనవరిలో ఆశ్రిన్‌ను కలుసుకున్న నాగరాజు కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుందామని చెప్పాడు.

ఈ ఏడాది జనవరిలో ఒక్కటైన ప్రేమజంట
ఈ క్రమంలో జనవరి చివరి వారంలో ఆశ్రిన్ పారిపోయి హైదరాబాద్ వచ్చింది. లాల్‌దర్వాజలోని ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఆశ్రిన్, నాగరాజు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తనను గుర్తించకుండా నాగరాజు వేరే ఉద్యోగంలో చేరాడు. అయితే హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆశ్రిన్ కుటుంబసభ్యులు గుర్తించడంతో ఈ కొత్త జంట కొన్ని రోజులు విశాఖపట్నంకు వెళ్లారు. ఎవరూ తమను వెతకడం లేదని భావించి.. మళ్లీ ఐదు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలో నివసిస్తున్నారు.

అంతా చూస్తుండగానే.. భార్య ముందే భర్తను ఇనుపరాడ్లతో కొట్టి చంపారు
మళ్లీ హైదరాబాద్ వచ్చారనే విషయం తెలిసిన ఆశ్రిన్ కుటుంబసభ్యులు ఈ జంట కదలికలను గమనించారు. బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్‌లు కాలనీలోంచి ద్విచక్ర వాహణంపై బయటకు రాగానే ఆశ్రిన్ సోదరుడు, అతడి స్నేహితుడు బైక్‌పై వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టి హతమార్చారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యపై సాక్ష్యాధారాలు సేకరించామని ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కళ్ల ఎదుటే భర్త చనిపోవడంతో ఆశ్రిన్ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమెను నాగరాజు బంధువులు అక్కడ్నుంచి తీసుకెళ్లారు.

ఎంత వేడుకున్నా.. ఆశ్రిన్ కన్నీటిపర్యంతం
తన భర్తను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆశ్రిన్ కన్నీటిపర్యంతమైంది. తన భర్తపై దాడి చేస్తుండగా అడ్డువెళ్లానని.. ఎంత వేడుకున్నా.. తనను తోసేసి తన సోదరుడు, మరికొందరు నాగరాజుపై ఇనుపరాడ్లతో కొట్టి చంపారని తెలిపింది. అక్కడున్నవారందరిని తన భర్తను కాపాడాలని కోరినా ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంది. తన భర్తను చంపినవారిని శిక్షించి, తనకు న్యాయం చేయాలని ఆశ్రిన్ కోరింది.












Click it and Unblock the Notifications