యాదాద్రీశుని ఆలయ హుండీకి భారీ ఆదాయం..
తెలంగాణలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఒకటి. ఈ ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా కూడా పిలుచుకుంటారు. ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం అనంతరం ఇక్కడికి భక్తులు బారులు తీరుతున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో నగరవాసులంతా యాదాద్రి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. వీకెండ్ ఓ పక్క, వినాయక చవితి పండుగ ఇలా సెలవులు రావడంతో యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ హుండీకి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నిన్న (శనివారం) వినాయక చవితి, వీకెండ్ కావటంతో వేల సంఖ్యలో భక్తులు లక్ష్మినరసింహస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మెుక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో భక్తులు లక్ష్మి నరసింహస్వామివారి దర్శనం చేసుకోవడంతో యాదాద్రి ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. శనివారం ఒక్క రోజే 11,64,144 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు పేర్కొన్నారు. పూర్తి వివరాల మేరకు.. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 57,424 వేలు సమకూరగా, దర్శనాల ద్వారా రూ. 33,900 వచ్చాయి.

బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 44,100 రాగా, ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,47,960 లభించింది. కల్యాణకట్ట ద్వారా రూ.42,000 రాగా, యాదరుషి నిలయం ద్వారా రూ.33,728 సమకూరింది. సువర్ణ పుష్పార్చాన ద్వారా రూ.26,400 వచ్చినట్లు తెలిపారు. కార్ పార్కింగ్ ద్వారా రూ.1,50,000 ఇలా మెుత్తంగా రూ.11,64,144 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. నేడు (ఆదివారం) సెలవు దినం కావటంతో భక్తుల రద్దీ మరింత పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే ఆలయ హుండీ ఆదాయం కూడా పెరిగే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications