తెలంగాణా ప్రభుత్వానికి భారీ షాక్.. రూ.900 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ గట్టి షాక్ ఇచ్చింది. పాలమూరు-రంగారెడ్డి , దిండి ప్రాజెక్టులపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ అయింది. ఈ మేరకు జరిపిన విచారణలో తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఏపీ పిటీషన్ పై విచారణ.. తెలంగాణాకు భారీ జరిమానా విధించిన ఎన్జీటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టు లను పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని ఏపీ ప్రభుత్వం, కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టుకు పర్యావరణం తో సహా అనేక ఇతర అనుమతులు లేవని, ప్రాజెక్టుల నిర్మాణాలను నిలుపుదల చేయాలని తాము ఇచ్చిన ఆదేశాల అమలు కావడం లేదని పేర్కొని తెలంగాణ ప్రభుత్వానికి సుమారు 900 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది.

రెండు ప్రాజెక్ట్ ల వ్యయంలో 1.5 శాతం జరిమానా
ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం వ్యయంలో 1.5 శాతం జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ తీర్పు వెలువరించింది. ఇక ఈ జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద జమ చేయాలని పేర్కొంది. తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని వెల్లడించింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని ఈ విషయంలో కూడా అమలు చేయాలని ఎన్ జి టి చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం .. ఎన్జీటీ తీర్పుతో భారీ షాక్
అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని కోస్గి వెంకటయ్య అనే పిటిషన్ దారుడు వేసిన పిటిషన్ తో పాటు ఇదే అంశంపై కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాయి. ఇక ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జాతీయ హరిత ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి మూడు వందల కోట్ల జరిమానా తో పాటు పర్యావరణ నష్టపరిహారం కింద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లో 528 కోట్ల రూపాయలు, దిండి ప్రాజెక్టు లో 92 కోట్ల రూపాయలు జరిమానా వేసినట్టుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది.












Click it and Unblock the Notifications