హైదరాబాద్‌లో దారుణం.. గర్భిణీపై విచక్షణ రహితంగా దాడి చేసిన భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పట్ల ఓ భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. కడుపుతో ఉందని కూడా చూడకుండా నడిరోడ్డుపైనే కోపంతో ఊగిపోతూ కాలితో ఎగిరితన్నాడు. అంతటితో ఆగకుండా బండరాయితో గర్భవతైన భార్యను హత్య చేసేందుకు యత్నించాడు. పలుమార్లు బండరాయితో కడుపుపై, తలపై మోదడంతో తీవ్ర గాయాలపాలైంది. చివరికి మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయి ఉంటుందని భావించిన భర్త అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హఫీజ్‌పేట ఆదిత్యనగర్‌లో మహ్మద్ బస్‌రత్ (32) ఇంటీరియర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2023 జనవరిలో అజ్‌మేర్ దర్గాకు వెళ్తున్న క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన షబానా పర్వీన్ (22)తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త స్నేహంగా మారడం.. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారడంతో 2024 అక్టోబర్‌లో కోల్‌కతాకు వెళ్లి ఆమెను వివాహం చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత హఫీజ్‌పేటకు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. అయితే షబానా పర్వీన్ వేరు కాపురం పెడదామని కోరడంతో.. అదే బస్తీలో ఈ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య విభేదాలు మొదలై తరచూ గొడవపడుతుండే వారని తెలుస్తోంది. ఇటీవల పర్వీన్ గర్భం దాల్చింది. మార్చి 29న ఆమెకు వాంతులు అధికమవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశాడు.
ఇక ఆమె ఆరోగ్యం కొంత మెరుగు పడటంతో ఏప్రిల్ 1న రాత్రి 10 గంటల సమయంలో భార్యను డిశ్ఛార్జి చేయించుకొని బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో కోపంతో ఊగిపోయిన బస్‌రత్.. నడిరోడ్డు పైనే భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. పక్కనే ఉన్న సిమెంట్ రాయి తీసుకొని ఆమె తలపై, కడుపుపై పలుమార్లు బలంగా రాయితో మోదాడు. ఇక చివరికి ఆమె కదలకపోవడంతో చనిపోయిందనుకుని భావించి అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను చుట్టుపక్కల వారు రక్షించి ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిందని.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి 3న రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై.. బస్‌రత్ క్రూరంగా దాడి చేయడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications