వివాహేతర సంబంధం: బెల్టుతో భార్య మెడకు ఉరివేసి చంపిన భర్త
హైదరాబాద్: మరో మహిళపై ఉన్న మోజుతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను బెల్టుతో మెడకు ఉరివేసి చంపేసిన ఘటన జవహర్‌నగర్‌లోని మార్వాడీలైన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ నర్సింహారావు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజేష్ 2009 మే 9న ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గౌతమి(25)ని వివాహం చేసుకున్నాడు.
పెళ్లి సమయంలో గౌతమి తల్లిదండ్రులు రూ. 2.5 లక్షలను కట్నంగా ఇచ్చారు. వీరికి ఐదు ఏళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలో బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టకు వలస వచ్చారు. రాజేష్ ఓ ప్రింటింగ్‌ప్రెస్‌లో పని చేస్తుండగా గౌతమి సికింద్రాబాద్‌లోని టెలీనార్ స్టోర్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఆరు నెలల క్రితం దంపతులిద్దరూ జవహర్‌నగర్‌లోని మార్వాడీలైన్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చారు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత దంపతులిద్దరూ తరచూ కుటుంబ కలహాలతో గొడవ పడ్డారు. దీంతో పలుమార్లు ఇరువర్గాలకు చెందిన పెద్దలు పంచాయితీ పెట్టి భార్యాభర్తలకు సర్దిచెప్పారు.

ఈ క్రమంలో రాజేష్ కొంతకాలంగా వేరే అమ్మాయితో సెలఫోన్లో మాట్లాడుతూ ఆమెతో చనువుగా ఉండున్నాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడని గౌతమి తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో భార్యభర్తల మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. అయినా రాజేష్ ప్రవర్తనలో మార్పురాలేదు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఈవిషయంలో భార్యాభర్తలు ఘర్షణపడ్డారు. అర్ధరాత్రి సమయంలో రాజేష్ గౌతమి మెడకు బెల్ట్‌తో ఉరిబిగించి చంపేశాడు. మంగళవారం తెల్లవారుజామున గౌతమి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులకు తెలిపిన రాజేష్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన జవహర్‌నగర్ సీఐ నర్సింహరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనుమానంతో రాజేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా క్షణికావేశానికి గురై గౌతమిని బెల్ట్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశానని విచారణలో అంగీకరించాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. గౌతమి మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.












Click it and Unblock the Notifications