ఈటలను బయటకు పంపాక ఎంత తాగినా ఎక్కటం లేదట: కేసీఆర్, కేటీఆర్ లపై ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్!!
హుజురాబాద్ లో ఉప ఎన్నికల రాజకీయం సాగుతోంది. ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హుజురాబాద్ కేంద్రంగా మాటల యుద్ధ సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో హుజురాబాద్ రాజకీయం రసకందాయంలో పడింది. హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవటంలో నిమగ్నమయ్యారు. నువ్వా నేనా అన్నట్టు టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఎన్నికల సమరం సాగుతుంది.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్
బీజేపీ నుండి ఉప ఎన్నిక బరిలోకి దిగిన ఈటల రాజేందర్ కోసం ప్రచారం నిర్వహించటానికి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగారు. అరవింద్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తూ సీఎం కేసీఆర్ పై, కేటీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కెసిఆర్ పై ధ్వజమెత్తిన ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్ పతనానికి హుజురాబాద్ ఉప ఎన్నిక నాంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈటల గెలిస్తే ఏమొస్తది అని ప్రచారం చేస్తున్నటీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ అరవింద్ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఈటలను బయటకు పంపాక ఎంత తాగినా మందు ఎక్కటం లేదట
హన్మకొండ మండలంలోని మర్రిపల్లి, మర్రిపల్లి గూడెం, వంగపల్లి, పంగిడి పల్లి, లక్ష్మీ పూర్, జూజునూర్ పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ ను, కేటీఆర్ ను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయ్యా కొడుకులిద్దరూ మత్తులో మునుగుతున్నారని, టీఆర్ఎస్ పార్టీ నుండి ఈటల రాజేందర్ ను బయటకు పంపాక ఎంత తాగినా మనసున పడటం లేదట.. మందు ఎక్కటం లేదట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు ఈటల రాజేందర్ గెలిస్తే ఏమొస్తది అని ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు అదిరిపోయే సమాధానం చెప్పారు.

ఈటల రాజేందర్ గెలిస్తే కేసీఆర్ కు వచ్చేది అదే
ఈటల రాజేందర్ గెలిస్తే కేసీఆర్ కు బుద్దొస్తది.. కేసీఆర్ కు సోయి వస్తది అంటూ పంచ్ వేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈటల గురించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించటానికి ఏం చేస్తున్నారో గుర్తించి డానికి తగ్గట్టు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. మొదటి నుండి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడటంలో దూకుడు చూపించే ఎంపీ అరవింద్ ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటుతో చెంప చెళ్ళుమనిపిస్తే కేసీఆర్ కు మర్చిపోయినవి అన్నీ యాదికొస్తాయని దిమ్మ తిరిగే పంచ్ లు వేస్తున్నారు.

కేసీఆర్ చెంప చెళ్ళుమనే తీర్పు ఇవ్వాలి ప్రజలు
ఇక ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్న ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు ఈ ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇది ఆత్మ గౌరవానికి కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం అని ఆయన పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికలతో కేసీఆర్ చెంప చెళ్ళుమనే సమాధానం ఓటర్లు చెప్పాలని అంటున్నారు. ఓటేస్తే దళిత బంధు రాదనీ, పించన్లు పోతాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తనకు ఓటేస్తే పథకాలు రాకుండా పోతాయా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి కేసీఆర్ కు ప్రజలు షాక్ ఇస్తారని ఈటల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications