ఇంత దిగజారుడు తనమా? హరీశ్..నీ చరిత్ర బయటపెడతా: ఈటల రాజేందర్ నిప్పులు
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికల జరగనున్న క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లు పరస్పర విమర్శలు చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. హరీశ్ రావుకు మతిభ్రమించిందని అందుకే ఇష్టానుసారం అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు.

హరీశ్ రావుకు ఈటల రాజేందర్ సవాల్
హుజూరాబాద్‌లో బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఇతర పార్టీ నేతలతో కలిసి ఈటల రాజేందర్ గురువారం మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావు మాట్లాడే ప్రతి మాత వ్యంగ్యంగా, అసత్యాలతో కూడినవిగా ఉన్నాయన్నారు. ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి జరగలేదని చేస్తున్న అసత్య ప్రచారాలపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని హరీశ్ రావుకు సవాల్ విసిరారు ఈటల రాజేందర్. ఉన్నతమైన స్థానంలో ఉన్న హరీశ్ రావు దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలానే విచక్షణ కోల్పోయి మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని అన్నారు.

హరీశ్ రావు చరిత్ర బయటపెడతానంటూ ఈటల ఫైర్
హరీశ్ రావు చరిత్ర బయటపెడతానని ఈటల రాజేందర్ హెచ్చరించారు. తన మీద చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని.. చర్చించేందుకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రావాలని ఈటల సవాల్ విసిరారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పారు. హరీశ్ రావు ఓ తోపు అని అనుకుంటున్నారా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. హరీశ్ రావు నిర్వాకంపై ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు ఈటల. హుజురాబాద్‌లో హరీశ్ నడిచే రోడ్లు ఎవరు వేశారని ఆయన నిలదీశారు. హరీశ్ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టాడని ఈటల రాజేందర్ ఆరోపించారు.

ఏం చేసినా.. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతారు..
ఈటలతో పనిచేసే కార్యకర్తలెవరు? ఎవరు మద్దతుగా నిలుస్తున్నారనే వివరాలు సేకరించి, వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేసి, తమ వెంట ఉంటేనే రిలీజ్ చేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. తాను నియమించి కాంట్రాక్టు ఉద్యోగులను, ఇతర ఆస్పత్రుల్లో పనిచేస్తున్నవారిని తొలగిస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఇతర సిబ్బంది కుటుంబసభ్యులు బీజేపీ తరపున తిరిగితే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. రేషన్ డీలర్లను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు ఈటల రాజేందర్.
Recommended Video

హుజూరాబాద్‌లోనూ.. దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుంది..
డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని.. హుజూరాబాద్‌లో తన వెంట వస్తే.. ఎక్కడ కట్టించానో చూపిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్‌లో 500 ఇళ్లు చొప్పున కట్టించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు.. ఈ రాష్ట్రం తమదేనని, తామే సాధించామని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మధ్యనున్న దుబ్బాకలో రోడ్లు వేశారా? డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారా? అందుకే అక్కడ ప్రజలు టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పారన్నారు. హుజూరాబాద్‌లో కూడా టీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని ఈటల వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications