హుజురాబాద్ పాలిటిక్స్ : నేతల దండయాత్రతో కొత్త భయం, రాకండి మహాప్రభో అంటున్న జనం !!
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లుగా తయారైంది హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజల పరిస్థితి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇది చేస్తాం అది చేస్తామని హామీలు గుప్పిస్తూ, నియోజకవర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు జోరుగా పర్యటనలు చేస్తున్నా, ఆ పర్యటనలే తమ కొంప ముంచుతున్నాయి అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అసలే కరోనా కష్టకాలంలో నానా ఇబ్బందులు పడుతున్న వేళ, మీ రాకతో మళ్లీ కరోనా మహమ్మారి నియోజకవర్గంలో ఆహ్వానించవద్దు అంటూ వారు రాజకీయ పార్టీల నేతలను విజ్ఞప్తి చేస్తున్నారు హుజురాబాద్ వాసులు. అందుకు కారణం లేకపోలేదు.

హుజురాబాద్ ప్రజలకు కరోనా భయం .. కొంప ముంచుతున్న ప్రచార పర్వం
హుజురాబాద్ ఎన్నికల రాజకీయం హుజురాబాద్ ప్రజలకు ఇబ్బందికరంగా తయారైంది. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు నిత్యం ఎవరో ఒకరు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో హుజురాబాద్ ప్రజలకు కరోనా భయం పట్టుకుంది. నియోజకవర్గంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయం సాధించాలన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీల నేతలు హోరా హోరీ గా ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార పర్వం హుజురాబాద్ వాసుల కొంప ముంచుతోంది.

ఈటల టార్గెట్ గా రంగంలోకి కేసీఆర్ మంత్రుల దళం
అసైన్డ్ భూములు కబ్జా చేశారన్న ఆరోపణలతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించి సీఎం కేసీఆర్ వేటు వేయడంతో, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఈటల రాజేందర్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హుజరాబాద్ నియోజకవర్గం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని మంత్రులను రంగంలోకి దింపారు. దీంతో కేటీఆర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు రంగంలోకి దిగారు.

సభలు, సమావేశాలతో హుజురాబాద్ లో పొలిటికల్ హీట్
టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా సమావేశాలను నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తూ విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అటు బిజెపి నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా రంగంలోకి దిగి హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలలో తమ పాత్ర పోషిస్తున్నారు. మొన్నటి వరకు ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. గ్రామగ్రామాన పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరుగుతూ హుజురాబాద్ బిడ్డగా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన వెంట బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక బండి సంజయ్ కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో రంగంలోకి దిగి పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో పెరుగుతున్న కరోనా కేసులు
హుజురాబాద్ నియోజకవర్గం మీద ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి సైతం కీలక నాయకులతో చక్రం తిప్పే పనిలో ఉన్నారు. ఇలా అన్ని పార్టీల నేతలు మూకుమ్మడిగా హుజురాబాద్ నియోజకవర్గం మీద దండయాత్ర చేయడంతో హుజరాబాద్ లో నిత్యం సభలు-సమావేశాలు సందడి నెలకొంది. అయితే దీంతో నియోజకవర్గంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు రాకపోకలతో, సమావేశాలతో హుజురాబాద్ లో నిత్యం ఎక్కడో ఒక చోట గుంపులుగా జనాలు ఉండడం కరోనా వ్యాప్తికి కారణంగా మారుతుంది. కరోనా నిబంధనలను గాలికి వదిలేసి, సభలు సమావేశాలు నిర్వహించడంతో నియోజకవర్గంలో మళ్ళీ కొత్త కేసులు పెరుగుదల మొదలైంది.

హుజూరాబాద్ లో కేసులు పెరుగుతున్నాయని స్వయంగా వెల్లడించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్
హుజురాబాద్ లో కరోనా కేసులు పెరుగుదల మొదలైనట్టు తెలంగాణ ప్రజా ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాస్ తెలిపారు. కేసుల పెరుగుదల పై కలెక్టర్లతో సమీక్ష చేయనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కోవిడ్ చికిత్స కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన హుజరాబాద్ లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కానీ మాస్కులు ధరించటం , సామాజిక దూరాన్ని పాటించటం వంటి నిబంధనలకు తిలోదకాలిచ్చి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులే కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటం గమనార్హం .

కేసుల పెరుగుదలతో మాదగ్గరకు రాకండి మహాప్రభో అంటున్న హుజురాబాద్ జనం
తాజాగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మా దగ్గరకు రావద్దు మహాప్రభో అంటూ రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా పట్టింపు లేకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల కంటే అధికారపక్ష నాయకుల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి అని, మంత్రుల పర్యటనలు సైతం బాధ్యత లేకుండా, కరోనా భయం లేకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెబుతున్న నేపథ్యంలోనైనా తమను ఇబ్బంది పెట్టొద్దని, ఎన్నికలొస్తే ఎవరికి ఓటు వేయాలో తమకు తెలుసని ప్రజలు చెబుతున్నారు. సభలు, సమావేశాలు పెట్టి, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను కరోనా మహమ్మారికి బలి చేయవద్దని హుజురాబాద్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications