రైల్వేస్టేషన్: బిస్కెట్ల ఆశ చూపి బాలుడ్ని కిడ్నాప్ చేసిన మహిళలు
హైదరాబాద్: ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ప్లాట్‌ఫాంపై ఆడుకుంటున్న ఆయూష్ అనే బాలుడిని ఇద్దరు మహిళలు తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
హైదరాబాద్ నగర శివారులోని బండ్లగూడలో అంజూమ్ అనే మహిళ స్థానికంగా ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. స్వస్థలమైన కాన్పూర్ వెళ్లేందుకు సోమవారం ఉదయం తన ఏడేళ్ల కుమారుడు ఆయూష్‌తో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది.

కాగా, బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు మహిళలు బిస్కెట్లు ఆశచూపి అతడ్ని ఎత్తుకెళ్లారు. కుమారుడు కనిపించకపోవడంతో కంగారుపడిన అంజూమ్ వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.

చుడీదార్‌లో ఉన్న ఓ యువతి మరో మహిళతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని రక్షించేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. స్థానిక గోపాలపురం పోలీసుల సాయంతో మూడు బృందాలుగా ఏర్పడిన రైల్వే పోలీసులు బాలుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!