హైదరాబాద్ బుక్ ఫెయిర్: తోపుడు బండి ఓ ప్రత్యేకాకర్షణ, కవిత్వానికి పెద్ద పీట
హైదరాబాద్: అతని పేరు షేక్ సాదిక్ అలీ. చాలా కాలం జర్నలిస్టుగా పనిచేశాడు. ఆ తర్వాత మ్యారేజీ బ్యూరోలు నడపడం ప్రారంభించాడు. ఎంఎ తెలుగు సాహిత్యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాడు. కానీ కవిత్వం రాయడు. కానీ, కవిత్వానికి పెద్ద పీట వేస్తాడు. ప్రజల్లో కవిత్వాభిరుచిని పెంచడానికి, కవిత్వాన్ని పాఠకుల ముంగిళ్లలోకి తీసుకుని వెళ్లడానికి తోపుడు బండి అనే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.
ప్రస్తుతం ఆ తోపుడు బండి హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మంగళవారం సాయంత్రం బుక్ ఫెయిర్ ప్రాంగణంలో జరిగిన సభలో గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో ఆ తోపుడు బండి గురించి ప్రస్తావించారు. తొపుడు బండి పెట్టిన స్టాల్‌ను అంతకు ముందు సందర్శించారు. సాదిక్ అలీ పెట్టిన తోపుడు బండి స్టాల్ ప్రముఖుల దృష్టిని కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. తోపుడు బండిలో కవిత్వ గ్రంథాలను పెట్టి అతను విక్రయిస్తున్నాడు.

కవిత్వాభిరుచి గల వారు, కవులూ రచయితలకు బుక్ ఫెయిర్‌లో అదో కూడలిగా మారింది. సాదిక్ ఏది చేసిన దీక్షతో, నిబద్ధతతో చేస్తాడు. కవిత్వంపై పాఠకులకు అభిరుచి తగ్గిందని భావిస్తున్న తరుణంలో అదేమీ కాదని చెప్పడానికి ఆయన తోపుడు బండి ప్రయోగం పనిచేస్తోంది.
కవిత్వాన్ని పాఠకుల చెంతకు చేర్చడమే తన లక్ష్యమని షేక్ సాదిక్ అలీ చెబుతున్నాడు. ప్రతీ సాయంత్రం ఓ కవిని శాలువాతో సత్కరించే పనిని కూడా సాదిక్ ఆ తోపుడు బండి స్టాల్‌లో నిర్వహిస్తున్నాడు. పుస్తకాలు అమ్ముడవుతున్నాయా అని అడిగితే ఆ రోజు కలెక్షన్లు ఎంతనో చెబుతున్నాడు. ఆ కలెక్షన్ల వివరాలను కూడా అతను ఫేస్‌బుక్కులో పెడుతున్నాడు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 23వ తేదీన పబ్లిక్ గార్డెన్ సమీపంలోని ఎన్టీఆర్ మైదానంలో ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు సాగుతుంది. పెద్ద యెత్తున స్టాల్స్ కూడా వెలిశాయి. 350కి పైగా స్టాల్స్ ఉన్నాయి. పుస్తకాభిమానులు ప్రతి రోజూ పెద్ద యెత్తున రావడమే కాకుండా పుస్తకాలు కూడా కొంటున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను చూస్తే ప్రజల్లో పుస్తకాల పట్ల అబిమానం తగ్గలేదని అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications