Deepavali: టపాసులు కాల్చడంపై ఆంక్షలు, ఈ వేళల్లోనే; ఈసీకి రాజా సింగ్ ఫిర్యాదు
హైదరాబాద్: దీపావళి పండగ సందర్భంగా బాణసంచా(టపాసులు) కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు నవంబర్ 12 నుంచి 15వ తేదీ రాత్రి వరకు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఉత్తర్వులు జారీ చేశారు.
ఎక్కువ శబ్ధం వచ్చే టపాసులను రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య కాల్చాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్ధం వచ్చే టపాసులు కాల్చొద్దని సూచించారు. ఎవరైనా ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

శాంతి భద్రతలతో పాటూ నగర ప్రజలకు ప్రశాంతతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కీలక సూచనలు చేస్తున్నట్లు సందీప్ శాండిల్య తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 67(సి) కింద తన విధులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.కాగా, ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిబంధనలు విధిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ జిల్లాల్లోనూ ఇలాంటి ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్య నేపథ్యంలో అక్కడ టపాసులు కాల్చడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాలుష్య కట్టడికి అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోని దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు.
బాణసంచా దుకాణాల కోసం ఈసీకి రాజా సింగ్ ఫిర్యాదు
బీజేపీ ఎమ్మెల్యే, గోషామహల్ అసెంబ్లీ అభ్యర్థి రాజాసింగ్ శుక్రవారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. దీపావళి పండగ విషయంలో ఆంక్షలు తొలగించాలని సీఈవోను కోరారు. అధికారులు.. బాణసంచా దుకాణాలను రాత్రి 10 గంటలకే బలవంతంగా మూయిస్తున్నారన్నారు. వాటిని అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. లేదంటే అప్పులు తెచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఆర్థికంగా నష్టపోయి వారు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications