బైక్ పై ప్రయాణం.. 4 ఏళ్ల పిల్లలకూ తప్పనిసరిగా హెల్మెట్: సీపీ సజ్జనార్ వార్నింగ్
ఇటీవలికాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్ స్పీడ్. ఆ తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం, మద్యం తాగి బండి నడపడం, ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం లాంటి వాటితో వరుసగా ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇక తాజాగా 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లో భాగంగా చేపట్టిన 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా.. 'బాలల రహదారి భద్రతా దినోత్సవం' పురస్కరించుకుని బంజారాహిల్స్ అగ్రసేన్ కూడలి వద్ద చిన్నారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే 4 ఏళ్లు పైబడిన పిల్లలకు తప్పనిసరిగా హెల్మెట్ ధరింపజేయాలని ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నగరాన్ని ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని సజ్జనార్ పేర్కొన్నారు. రహదారి ప్రమాదంలో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుందని.. అటువంటి విషాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వాహనదారులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడే భద్రతా నియమాలను ఒక పవిత్రమైన క్రతువులా పాటించాలని సూచించారు.
ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో 'నో హెల్మెట్ - నో ఎంట్రీ' బోర్డులను ఏర్పాటు చేసి, నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. స్థానిక ట్రాఫిక్ సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం 'రహ్ వీర్' స్కీం ద్వారా నగదు పురస్కారంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పిస్తోందని, ఎవరూ భయపడకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications